Tuesday 7 May 2024

శ్రీకృష్ణుడు భగవద్గీతలో సత్యపాలన గురించి విస్తృతంగా ఎందుకు చెప్పలేదు?

 

కర్మ సన్న్యాస యోగం గురించి, ఆధ్యాత్మిక సాధనల గురించి చెప్పిన శ్రీకృష్ణుడు, భగవద్గీతలో ఆధ్యాత్మిక సాధనలకు పునాదిలాంటి సత్యపాలన గురించి అక్కడక్కడ (10.4) చెప్పినా, విస్తృతంగా ఎందుకు చెప్పలేదు? 


నాకు స్ఫురించిన సమాధానం. 


విద్యాభ్యాసం తరువాత, గృహస్థాశ్రమం స్వీకరించేముందు, పరమ గమ్యమైన మోక్షం కోసం ప్రయత్నించే ప్రక్రియలో భాగంగా, కర్మ క్షయానికి, జ్ఞాన వికాసానికి మనిషి పాటించవలసిన పద్ధతులు, చేయవలసిన కర్మలను గురించి, గురువు చెప్పే విషయాలివి.


తైత్తిరీయోపనిషత్ 1.11.1


సత్యం వద । ధర్మం చర । స్వాధ్యాయాన్మా ప్రమదః ।

ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః ।

సత్యాన్న ప్రమదితవ్యమ్ । ధర్మాన్న ప్రమదితవ్యమ్ ।

కుశలాన్న ప్రమదితవ్యమ్ । భూత్యై న ప్రమదితవ్యమ్ ।

స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్ ॥


“నిజం మాట్లాడు. ధర్మాన్ని పాటించండి. చదువు విషయంలో అలక్ష్యం వద్దు. గురువుకు కావాల్సిన సంపదను సమర్పించిన తరువాత, పూర్వకుల నుండి వస్తున్న వంశాన్ని కొనసాగించడానికి సంతానం పొందు. సత్యం పాటించడంలో నిర్లక్ష్యం కూడదు. ధర్మబద్ధమైన కార్యకలాపానికి విచలనం ఉండకూడదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో ఎలాంటి లోపం ఉండకూడదు. అనుకూలమైన కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. నేర్చుకోవడం, నేర్పించడం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి.

---

ఇందులో సత్యం వద, సత్యాన్న ప్రమదితవ్యమ్, అనేవి గమనించగలరు.


ఆధ్యాత్మిక సాధనలకు పునాదిలాంటి సత్యపాలన గురించి, ఋగ్వేదము, ఉపనిషత్తులు విస్తృతంగా చెప్పాయి.

---

భగవద్గీత విషయానికి వచ్చేసరికి, అక్కడ అర్జునుడి మానసిక స్థితి ప్రధానంగా గమనించాలి.


భగవద్గీత అర్జునుడు వినే సమయానికి, అతని విద్యాభ్యాసం పూర్తి అయి, అతను గృహస్థాశ్రమంలో ప్రవేశించి, సంతానం కూడా పొందాడు. అక్కడక్కడ క్షత్రియుల సహజగుణమైన అహంకారం పొడచూపినా,  మిగిలిన పాండవులలాగ అతను కూడా సత్యపాలన విషయంలో ఎటువంటి అలక్ష్యం ప్రదర్శించినట్లు, మహాభారతంలో వ్యాసుడు చెప్పలేదు.


అతను క్షత్రియ ధర్మాన్ని మరచి, యుద్ధంలో, బంధువులను, స్నేహితులను చంపాలా అన్న ధర్మ సంకటంలో పడినపుడు,భగవద్గీత అర్జునుడికి చెప్పవలసిన అవసరం వచ్చింది.


ధర్మం చర, ధర్మాన్న ప్రమదితవ్యమ్, అన్న స్మృతి వాక్యాలకు వ్యతిరేకమైన ఆలోచన కలగడం వల్ల, ఆ ధర్మాచరణ గురించి, దాని వలన సాధన ఏరకంగా చేయవచ్చునో అన్న విషయాల మీదనే శ్రీకృష్ణుడు దృష్టి పెట్టినట్లు నాకనిపించింది.