మనదేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ వివాహ సాంప్రదాయాలు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాలలో మంగళసూత్రధారణ సమయాన్ని పెళ్ళి జరగాల్సిన ముహూర్తంగా భావిస్తే, మరికొన్ని ప్రాంతాలలో జీలకఱ్ఱ, బెల్లం కలిపిన ముద్దను వధువరులు ఒకరి తలపై మరొకరు పెట్టడాన్ని పెళ్ళి జరగాల్సిన ముహూర్తంగా భావిస్తారు.
రామాయణ కాలంలో అగ్నిసాక్షిగా చేసిన పాణిగ్రహణమే పెళ్ళికి సూచనగా వాల్మీకి మహర్షి చెప్పారు.
---
బాలకాండలో దశరథుడు తన కుమారులను, జనకుడు వధువులను సిద్ధం చేసిన తరువాత, వశిష్ఠుడు అగ్నిని వేలుస్తారు.
అగ్నిమాధాయ తం వేద్యాం విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వశిష్ఠో మునిపుంగవ || ౧-౭౩-౨౪
శాస్త్రోక్తముగా, మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకునిరాగా, అప్పుడు ఆ మహా ప్రకాశవంతుడు మరియు మునిపుంగవడైన వశిష్ఠుడు అరణి అని పిలువబడే రెండు చెక్క కర్రలను రుద్దడం ద్వారా కర్మకాండను సిద్ధం చేసి, ఆ అగ్నిని వేల్చెను.
తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్ |
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా || ౧-౭౩-౨౫
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ |
అప్పుడు ఆ రాజు జనకుడు రకరకాల పెళ్లి ఆభరణాలతో అలంకరించబడియున్న సీతను ముందుకు నడిపించి అగ్ని సమక్షమున రాఘవునికి ఎదురుగా కూర్చోండబెట్టెను. తన తల్లి కౌసల్య యొక్క ఆనందాన్ని పెంచే రాముడిని ఉద్దేశించి జనకుడు ఇలా అన్నాడు.
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ || ౧-౭౩-౨౬
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
"ఈ నా కుమార్తె సీత, నేటినుండి నీకు సహధర్మచారిణి. విధ్యుక్తధర్మమును అనుసరించి పాణిగహణము ఒనర్పుము. నీకు శుభమగును.
పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా || ౧-౭౩-౨౭
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా |
"సర్వసౌభాగ్యవతియైన ఈమె పతివ్రతా. ఆమె ఎల్లప్పుడూ నీ నీడలా నిన్ను అనుసరిస్తుంది..." అని చెప్పి, జనక రాజు రాముని అరచేతులలో మంత్రపూతమైన నీటిని వదులుతు కన్యాదానము చేసెను.
--
తరువాత లక్ష్మణునికి ఊర్మళను, భరతునికి మాండవిని, శత్రుఘ్నునికి శ్రుతకీర్తిని ఇచ్చి కన్యాదానము చెసిరి.
ఆ తరువాత నూతన వధూవరులు అగ్నికి ప్రదక్షిణలు చేసి పెద్దలకు నమస్కరించిరి.
అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవ చ || ౧-౭౩-౩౫
ఋషీంశ్చైవ మహాత్మానః సహభార్యా రఘూద్వహాః |
యథోక్తేన తథా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ || ౧-౭౩-౩౬
వారి భార్యలతో పాటు అగ్నిప్రదక్షిణం చుట్టూ ప్రదక్షిణలు చేసి, జనక మహారాజుకు, మరియు ఋషుల చుట్టూ ప్రదక్షిణలు చేసిరి. తరువాత వధూవరులు నిర్దేశించబడిన ఆచారాలకు అనుగుణంగా తదుపరి వివాహ కర్మలను నిర్వహించిరి.
---
ఆనాడు పాణిగ్రహణమైన తరువాత అగ్నిప్రదక్షిణం చుట్టూ ప్రదక్షిణలు చేసి పెద్దలకు నమస్కరించడం గమనిస్తే, అగ్నిసాక్షిగా చేసిన పాణిగ్రహణమే పెళ్ళికి సూచనయా అనిపిస్తోంది.