Showing posts with label S.03.04 ముహూర్తబలం!. Show all posts
Showing posts with label S.03.04 ముహూర్తబలం!. Show all posts

Saturday, 26 September 2015

ముహూర్తబలం!

సనాతనధర్మం ప్రకారం ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  శుభాన్ని, విజయాన్ని ఆశిస్తూ చేసే పనులు ముహూర్తం చూసుకొని చేయమని పెద్దలు చెబుతారు.

శ్రీమద్రామాయణంలో కూడా ముహూర్తంయొక్క ప్రాముఖ్యత గురించి ఉంది.
---------

రావణుడు సీతను అపహరించుకొనిపోయిన తరువాత, ఆమెను వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులకు కొస ఊపిరితో  ఉన్న జటాయువు కనిపిస్తాడు.  సీత కోసం దుఖిస్తున్న శ్రీరాముని ఓదారుస్తూ, జటాయువు ఇలా అంటాడు.


యేన యాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ:|
విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామీ ప్రతిపద్యతే|     (అరణ్యకాండ 68వ సర్గ 12వ శ్లోకము)

"రావణుడు సీతను అపహరించుకొనిపోయిన ముహూర్తమును బట్టి, నీకు కనబడకుండపోయిన సీతారూప ధనము యజమానివైన నీకు మఱల త్వరలోనే లభించును. ఇది నిశ్చయము."


విందో నామ ముహూర్తోऽయం స చ కాకుత్‌స్థ నాऽబుధత్|
త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర:|
ఝషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి|      (అరణ్యకాండ 68వ సర్గ 13వ శ్లోకము)


"ఓ కాకుత్‌స్థా!  రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెన్నిధియైన సీతాదేవిని అపహరించుకొని పోయిన సమయము "వింద" ముహూర్తకాలము.  ఆ విషయమును అతడు ఎఱుగడు.  ఆ ముహూర్తము అతనికి మరణాంతకము.  కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేపవలె వెంటనే నశించిపోవుట నిజము"

--------------------------

ఈ విషయంలో శ్రీగీతా ప్రెస్ వారి వివరణ ఇలా ఉంది.

నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్ - ఇతి వింద:

"వింద" ముహూర్తకాలమున నష్టమైన ధనం తప్పక యజమానికి భద్రముగా లభించును.


రౌద్ర: శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభట: స్మృత:|
సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వ: కుతపస్తథా||
రౌహిణస్తిలకశ్చైవ 'విజయో' నైరృతస్తథా|
శంబరో వారుణశ్చైవ భగ: పంచదశ: స్మృత:||

ఈ పదునైదు (15)ను పగటి ముహూర్తములు.  11వదీయైన విజయ ముహూర్తమునకే 'విందము'  అని నామాంతరము.