Thursday, 3 September 2015

వనవాస నియమంలో ఉన్న శ్రీరాముడు మాంసం భుజించాడా?


కైకకు తండ్రి ఇచ్చిన మాటను నిలపడానికి అరణ్యవాసానికి బయలుదేరిన శ్రీరాముడు గంగానది తీరానికి చేరి, ఆ రాత్రి అక్కడే బస చేసి, ఉదయం నదిని దాటే ముందు, వనవాసులవలె తలవెంట్రుకులను మర్రిపాలతో తడిపి ముడి వేసుకుంటాడు.

 వనవాసులవలె జీవించడం త్రికరణశుద్ధితో ప్రారంభిస్తాడు.  అందులో భాగంగానే అడవిలో దొరికే ఫలాలు, కందమూలాలతో జీవించదలచుకుంటాడు.

అ)     తాను తండ్రి ఇచ్చిన మాటను నిలపడానికి అరణ్యవాసానికి బయలుదేరుతున్న విషయం తల్లి కౌసల్యకు చెప్పి, వనవాసనియమాలతో 14 సంవత్సరాలు తాను బ్రతుకబోతున్నట్లు చెబుతాడు.

స షట్చాష్టౌ చ వర్షాణి వత్స్యామి విజనే వనే|
ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్ (అయోధ్యాకాండ 20వ సర్గ 31 వ శ్లోకము)

"నేను నిజనారణ్యంలో 14 సంవత్సరములకాలము అడవులలో లభించు ఫలమూలములను సేవించుచు వానపస్థునివలె కాలము గడుపుదును".


ఆ)     ప్రయాగ ప్రాంతములో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆయనకు నమస్కరించి ఇలా అంటాడు.

పిత్రా నియుక్తా భగవన్ ప్రవేక్ష్యామ: తపోవనం|
ధర్మమేవ చరిష్యామ: తత్ర మూలఫలాశనా: (అయోధ్యాకాండ 54వ సర్గ 16 వ శ్లోకము)

"ఓ మహాత్మా! తండ్రి ఆదేశము ప్రకారము తపోవనములయందు ప్రవేశింపనున్నాము.  కందమూల, ఫలములనే భుజించుచు వానపస్థధర్మమును ఆచరించెదము".


ఐతే అంతర్జాలంలో (In Web forums on Internet) వనవాసనియమంలో ఉన్న శ్రీరాముడు మాంసం భుజించాడని, మద్యం సేవించాడని  చదివాను.

ఈ వాదనకు సహాయంగా ఈ క్రింది శ్లోకాలను చెబుతున్నారు.

-------


1)    చిత్రకూట పర్వతప్రాంతానికి చేరేముందు రాత్రి శ్రీరామ సీతాలక్ష్మణలు  ఒక సమతల ప్రదేశంలో విశ్రమిస్తారు.  అప్పుడు వారు మాంసం తిన్నట్లు ఉంది.

క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ|
బహూన్ మేధ్యాన్ మృగాన్ హృత్వా చేరతుర్యమునావనే|   (అయోధ్యాకాండ 55వ సర్గ 33 వ శ్లోకము)

"రామలక్ష్మణులు క్రోశెడు దూరము వెళ్ళి, అనేక మృగాలను చంపి ఆ మాంసమును  యమునానదీ తీరమున భక్షించిరి."

2)    మాయామృగాన్ని వెంటాడుతూ శ్రీరాముడు, ఆ తరువాత లక్ష్మణుడు ఆశ్రమం విడచి వెళ్ళిన తరువాత రావణుడు వారి ఆశ్రమానికి వస్తాడు.  అతిథికి స్వాగతం పలికి సీత ఇలా అంటుంది.

సమాశ్వస ముహూర్తం తు శక్యం వస్తుం ఇహ త్వయా ||
ఆగమిష్యతి మే భర్తా వన్యం ఆదాయ పుష్కలం |
రురూన్ గోధాన్ వరాహాన్ చ హత్వా ఆదాయ అమిషాన్ బహు ||   (అరణ్యకాండ 47వ సర్గ 22 వ శ్లోకము)

"ఓ బ్రాహ్మణా! కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనుము.  నా భర్త త్వరలో సమృద్ధిగా ఫలములను, దుప్పులను ముంగిసలను, ఎలుగుబంట్లను వేటాడి సమృద్ధిగా తీసుకుని రాగలడు."

ఇక్కడ సీతయే శ్రీరాముడు వనమృగములను చంపి తీసుకుని వస్తాడని అంటోంది కాబట్టి శ్రీరాముడు వనవాసకాలంలో మాంసం స్వీకరించాడని వాదన.

3)      సీత కోరికమేరకు శ్రీహనుమంతుడు శ్రీరాముని శరీరలక్షణాలను, స్వభావాన్ని, అలవాట్లను గురించి  చేబుతు ఇలా అంటాడు.

న మాంసం రాఘవో భుంక్తే న చాऽపి మధుసేవతే |
వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం ||   (సుందరకాండ 36వ సర్గ 41వ శ్లోకము)


"రాఘవుడు మద్యమాంసములను ముట్టుటలేదు.  వనములలో దొఱికెడి ఫలమూలములలో ఐదవభాగము స్వీకరించుచున్నాడు."


ఇక్కడ సీత అపహరణకు గురియైన తరువాత, శ్రీరాముడు మద్యమాంసాలను స్వీకరించడంలేదు కాబట్టి, అంతకుముందు స్వీకరించాడని వాదన.


-------------

శ్రీమద్రామాయణములో చాలా ప్రక్షిప్తాలు (తరువాతి కాలంలో చేర్చబడిన అంశాలు) ఉన్నాయి.  కొన్నింటిని గుర్తించడం కొంచెము కష్టమేనని చెప్పాలి.  అలా అని మనకు ఇబ్బంది కలిగించేవన్ని (లేదా) అర్థంకానివన్ని ప్రక్షిప్తమనలేము.

I)    "రామలక్ష్మణులు అనేక మృగాలను చంపి ఆ మాంసమును  యమునానదీ తీరమున భక్షించారు"  అని ఉన్న శ్లోకం ప్రక్షిప్తమనవచ్చును.  ఎందుకంటే అంతకు ముందు సర్గలోనే భరద్వాజ మహర్షితో, తాము "కందమూల, ఫలములనే భుజించుచు వానపస్థధర్మమును ఆచరించెదము" అని శ్రీరాముడు అన్నాడు కాబట్టి, ఈ శ్లోకం ప్రక్షిప్తమయి ఉండాలి.

II)    దశరథుని మరణవార్తను విని దు:ఖించి, శ్రీరాముడు లక్ష్మణునితో కలసి, ఇంగుడి వృక్ష పళ్ళను ముద్దగా చేసి, దశరథునికి పిండప్రదానం చేస్తూ, ఇలా అంటాడు.

ఇదం భుంక్ష్వ మహారాజ! ప్రీతో యదశనా వయం|
యదన్న: పురుషో భవతి తదన్నాస్తస్య దేవతా:||    (అయోధ్యాకాండ 103వ సర్గ 30 వ శ్లోకము)

"ఓ మహారాజ!  నిత్యము మేము భుజించెడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుచున్నాము.  దీనిని మీరు ఆరగింపుడు.  మానవులు తాము స్వీకరించెడి ఆహారపదార్థములనే దేవతలకు భక్తితో నివేదనగావింతురు గదా!"

ఇక్కడ శ్రీరాముడు "నిత్యము మేము భుజించెడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుచున్నాము." అని అంటున్నాడు. అంటే శ్రీరాముడు నిత్యము ఫలమూలములను సేవించుచు వానపస్థునివలె కాలము గడుపుతున్నాడని అర్థం కదా!


III)    2వ శ్లోకంలో సీత  "నా భర్త త్వరలో సమృద్ధిగా ఫలములను, దుప్పులను ముంగిసలను, ఎలుగుబంట్లను వేటాడి సమృద్ధిగా తీసుకుని రాగలడు." అన్న విషయానికొస్తే, ఆనాటి ప్రజల ఆహారపు అలవాట్లను కొంచెంలోతుగా పరిశీలిస్తే, అందులోని విషయం అర్థమవుతుంది.

ఆనాటి బ్రాహ్మణులు, క్షత్రియులు ఐదు గోళ్ళు ఉన్న కొన్ని రకాల మృగాలను తినేవారుగా శ్రీరామ, వాలి సంవాదంలో తెలుస్తుంది.

పంచ పంచ నఖా భక్ష్యా బ్రహ్మ క్షత్రేణ రాఘవ |
శల్యక: శ్వావిధో గోధా శశ: కూర్మశ్చ పంచమ: ||  (కిష్కింధకాండ 17వ సర్గ 39 వ శ్లోకము)

"బ్రాహ్మణ క్షత్రియులకు పంచనఖ జంతువులలో ముళ్ళపంది, వరాహము,ఉడుము, కుందేలు, తాబేలు అను ఐదు మాత్రమే భక్షింపదగినవి."

రావణుడు శ్రీరాముని పర్ణశాలకు బ్రాహ్మణ వేషంలో "ద్విజాతి వేషేణ" వస్తాడు.  ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయడం గృహస్థు ధర్మం.  అందునా వచ్చినవాడు బ్రాహ్మణుడు కాబట్టి, మరింత మర్యాద చేయాలనుకుని సీత "నా భర్త త్వరలో సమృద్ధిగా ఫలములను, దుప్పులను ముంగిసలను, ఎలుగుబంట్లను వేటాడి సమృద్ధిగా తీసుకుని రాగలడు." అని ఉండవచ్చును.

IV)    3వ శ్లోకంలో శ్రీహనుమంతుడు "రాఘవుడు మద్యమాంసములను ముట్టుటలేదు." అన్న విషయానికొస్తే, ఆ సమయంలో సీత మానసిక స్థితిని అర్థం చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది.

రావణుడు సీతను అపహరించి తీసుకునివచ్చినప్పటినుండి, ఆమె నిరంతరం శ్రీరామ ధ్యానంలో గడిపింది.  రావణుని ఆదేశం ప్రకారం రాక్షసస్త్రీలు సీతను వేధిస్తే, అదంతా ఒంటరిగానే భరించింది.  భరించలేని పరస్థితి కలిగినపుడు, రోదిస్తూ శ్రీరాముడు తనను మఱచిపోయాడా అని అనుమానపడింది తప్ప, శ్రీరామ ధ్యానం వదలలేదు.

పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరితవ్రతశ్చ |
స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభిస్త్వం రంస్యసే వీతభయ: కృతార్థ: ||  (సుందరకాండ 28వ సర్గ 14వ శ్లోకము)

"ఓ రామా! నీవు పిత్రాజ్ఞను నియమపూర్వకముగా పాలించి, వనవాసవ్రతమును పూర్తిచేసి, గడువు ముగియగానే వనములనుండి అయోధ్యకు చేరెదవని భావింతును.  లబ్ధమనోరథుడవై అచట నిర్భయముగ సుందరీమణులతో శృంగార సుఖములను పొందెదవని తలంతును".

సీతయొక్క ఈ మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు కాబట్టే, శ్రీహనుమంతుడు ఆమెను ఓదారుస్తూ,  సీత లేకపోవడంతో శ్రీరాముడు ఆమెను మఱచిపోయి, మద్యమాంసాలను స్వీకరిస్తూ ఉండడం లేదని, ఆమె కోసం పరితపిస్తూ, నిద్రకూడాపోవడంలేదని అమెను ఓదారుస్తూ అన్నమాటలివి.

No comments:

Post a Comment