వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము. ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది. మహాభారతము వ్రాసిన తరువాత వేదవ్యాసుడు 18 పురాణాలు వ్రాసినట్లు నానుడి.
పురాణాల ప్రకారం నందీశ్వరుడు శిలాదుని కుమారుడు. కుమారునికోసం శివుని గురించి తపస్సుచేసి పొందిన వరంవల్ల నందీశ్వరుడు జన్మించాడు. తరువాత కాలంలో అతడే శివుని వాహనంగా మారాడు.
పురాణాల ప్రకారం నందీశ్వరుడు శిలాదుని కుమారుడు. కుమారునికోసం శివుని గురించి తపస్సుచేసి పొందిన వరంవల్ల నందీశ్వరుడు జన్మించాడు. తరువాత కాలంలో అతడే శివుని వాహనంగా మారాడు.
పురాణాలు రచించిననాటికి శివునికి దేవతలలో ఉన్నత స్థానం ఉంది. శ్రీమద్రామాయణములో, భారతంలో ఉన్నత స్థానం లేదు. "రుద్రుడు" అనే దేవతను కీర్తించినట్లు ఉంది కానీ, ఈ రుద్రుడు, శివుడు ఒకరేననే సంకేతాలేమి శ్రీమద్రామాయణములో కనిపించవు.
శ్రీమద్రామాయణములో నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. ఐతే అది శివుని వాహనంగా మాత్రం కాదు.
---------------
తన సభలో మొదటిసారి శ్రీహనుమంతుని చూసి, అతని తేజస్సుకు విభ్రాంతిచెందిన రావణుడు ఇలా అనుకుంటాడు.
శంకాహతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతం|
కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాదిహాగత:|| (సుందరకాండ 50వ సర్గ 2వ శ్లోకము)
యేవ శప్తోऽస్మి కైలాసే మయా సంచాలితే పురా|
సోऽయం నానరమూర్తిస్స్యాత్ కింస్విద్బాణోऽపి వాऽసుర:|| (సుందరకాండ 50వ సర్గ 3వ శ్లోకము)
మహాతేజస్సుతో ప్రకాశించుచున్న కపివరునిగాంచి, సంశయచిత్తుడై, అతడు ఇట్లు ఆలోచింపసాగెను. "పూర్వము నేను కైలాసపర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన మహాత్ముడైన నందీశ్వరుడే ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇచటికి వచ్చెనా ఏమి? కానిచో ఇతడు వానరరూపమున వచ్చిన ఆ బాణాసురుడై యుండవచ్చును".
రావణుడు శ్రీహనుమంతుని చూసి, "ఇతడు కైలాస పర్వతాన్ని తాను కదిలించ చూసినపుడు, తనను శపించిన "భగవాన్" నందీశ్వరుడా?" అని తర్కించుకుంటున్నాడు.
ఇక్కడ రావణుడు నందిని "భగవాన్" అని అంటున్నాడుగానీ, పురాణాలలో కీర్తించినట్లు, శివుడి వాహనమైన నందిగా భావించడంలేదు.
వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణములో అక్కడక్కడ బ్రహ్మను "భగవాన్" అని సంబోధించాడుగానీ, మిగిలిన దేవతలను "భగవాన్" అని సంబోధించలేదు.
శ్రీమద్రామాయణములో ఎక్కడ కూడా శివుడి వాహనం నంది అని చెప్పలేదు. రావణుడు శివభక్తుడని కూడా చెప్పలేదు.
మరి ఏ కారణంతో రావణుడు "నంది" అనే వ్యక్తిని "భగవాన్" అని సంబోధించాడు?
దీనికి సమాధానం శ్రీమద్రామాయణములోనే మఱియొక చోట ఈ విధంగా ఉంది.
------------
మొదటసారి శ్రీరామునితో తలపడి, ఓడిపోయి, అవమానపడి, శ్రీరాముని దయతో లంకకు తిరిగి వచ్చిన రావణుడు, జరిగిన సంఘటనలు తలచుకుని భయపడుతాడు.
ఉమా నందీశ్వరశ్చాऽపి రంభా వరుణకన్యకా|
యథోద్తాస్తపసా ప్రాప్తం న మిథ్యా ఋషిభాషితం|| (యుద్ధకాండ 60వ సర్గ 11వ శ్లోకము)
"ఉమ, నందీశ్వరుడును, రంభయు, వరుణుని కూతురైన పుంజికస్థలయు నన్ను శపించియుండిరి. ఋషుల శాపములు వ్యర్థములు కావుగదా!"
ఇక్కడ రావణుడు ఉమ, నందీశ్వరుడు తనను శపించారని అంటూ, "ఋషుల శాపములు వ్యర్థములు కావుగదా!" అంటున్నాడు. అంటే నందీశ్వరుడు ఆనాటికే కైలాసపర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి అయి ఉండాలి.
"భగవాన్" అనే సంబోధన ఒక మహనీయుడికి, గౌరవనీయుడికి వాడే గౌరవ సంబోధనై ఉండాలి. "భగవాన్" అనే సంబోధన శ్రీమద్రామాయణంలో గొప్పఋషులకు వాడినట్లు కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది.
ఉదాహరణకు:
-------------
1) శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుని, దశరథుడు వశిష్టమహర్షిని ఇలా ప్రార్ధిస్తాడు.
అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్చదం|
తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయితుమర్హసి|| (అయోధ్యాకాండ 3వ సర్గ 6వ శ్లోకము)
"ఓ మహాత్మా! శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై, నిర్వహింపవలసిన పనులను గుఱించియు, సిద్ధపఱచవలసిన సంభారములనుగూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు."
2) సీతాలక్ష్మణులతో కలసి ప్రయాగకు చేరుకున్న తరువాత శ్రీరాముడు భరద్వాజ మహర్షిని దర్శిస్తాడు. అప్పుడు తమ పరిచయం ఈ విధంగా చేసుకుంటాడు.
న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజ:|
పుత్త్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ|| (అయోధ్యాకాండ 54వ సర్గ 13వ శ్లోకము)
పిమ్మట శ్రీరాముడు తమనుగూర్చి ఇట్లు తెలిపెను. "ఓ మహాత్మా! మేము దశరథ మహారాజు పుత్త్రులము. రామలక్ష్మణులము."
3) శ్రీరాముడు సీతాలక్ష్మణసహితంగా అరణ్యంలో తిరుగుతు, అగస్త్యమహర్షి ఆశ్రమం చేరుకుని, ఆ ఋషికి నమస్కరిస్తాడు.
అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం |
ఏష లక్ష్మణ! నిష్క్రామత్యగస్త్యో భగవాన్ ఋషి:|| (అరణ్యకాండ 12వ సర్గ 22వ శ్లోకము)
పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లనెను. "ఓ సౌమిత్రీ! పూజ్యుడైన అగస్త్యమహర్షి ఇడుగో! ఇటే బయటికి వచ్చుచున్నాడు. ఈయనయొక్క బ్రహ్మతేజస్సును బట్టి ఇతడు ఒక మహాతపోనిధియని తలంచుచున్నాను."
No comments:
Post a Comment