Thursday, 3 September 2015

కార్తికేయుడు (లేదా) స్కందుడు ఎవరి కుమారుడు?


వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము.  ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది.  మహాభారతము వ్రాసిన తరువాత వేదవ్యాసుడు 18 పురాణాలు వ్రాసినట్లు నానుడి.

శ్రీమద్రామాయణములోని 36-37 సర్గలలో శివ, పార్వతులు వివాహం తరువాత, వారి మైధునకార్యానికి దేవతలు అడ్డుపడడం వల్ల, కదలిన శివ తేజస్సు (వీర్యం) ఉమాదేవి ధరించలేకపోయింది.  అందువల్ల అగ్నిదేవుడు స్వీకరించి, తరువాత గంగకు ప్రసాదించగా, ఆమె  భరించలేక హిమాలయ ప్రాంతాలలో ఆ పిండాన్ని వదలి వేయగా, ఆ పిండము భూమిని చేరి, ఒక శిశువుగా మారింది.  ఆ శిశువును కృత్తిక తారలు పాలిచ్చి పెంఛాయి కాబట్టి కార్తికేయుడుగా నామం ధరించాడు.

పౌరాణికగాధల ప్రకారము కార్తికేయుడు (లేదా) స్కందుడు శివుని కుమారుడు.

ఐతే శ్రీమద్రామాయణానికి, పురాణాలకు మధ్యన వచ్చిన  మహాభారతములోని వన పర్వములో మాత్రము కార్తికేయుడు (లేదా) స్కందుడు అగ్ని కుమారుడుగా వర్ణింపబడ్డాడు.

మహాభారతములోని వన పర్వములో 223-224 భాగములలో ఆ కథ ఈ ప్రకారం ఉంది.

ఒకానొక సమయంలో సప్తర్షులు ఒక యజ్ఞము చేసి, హవిస్సును దేవతలకు ఇవ్వగా, దానిని దేవతలకు అగ్ని అందజేసాడు.  ఆ సమయంలో సప్తర్షుల అందమైన భార్యలను చూసి, మనస్సు చలించి, సప్తర్షుల శాప భయంతో ఒంటరిగా అడవిలో ఉండి, కామాన్ని అణచుకోలేక, తనను తాను అంతం చేసుకుందామనుకుంటాడు.

ఐతే అగ్ని మీద చాలా కాలం నుండి మనస్సుపడి, తిరస్కరింపబడ్డ దక్షుని కుమార్తె అయిన "స్వాహా", ఆ అవకాశం తనకు అనుకూలంగా మలచుకోదలచి, సప్తర్షులలో ఒకడైన అంగీరసుని భార్యయైన "శివ" రూపం ధరించి, అగ్నిని చేరి, తను కూడా అగ్ని పట్ల కాంక్ష కలిగియున్నట్లు చెబుతుంది.

అంగీరసుని భార్యయైన "శివ" రూపంలో ఉన్న "స్వాహా"ను అగ్ని ఆనందంతో స్వీకరించి, సంగమిస్తాడు.  అగ్ని వీర్యాన్ని గ్రహించిన "స్వాహా", ఆ వీర్యాన్ని, ఒక పక్షి రూపంలో హిమాలయాలకు చేరి, ఒక బంగారు కొలనులో విసరివేస్తుంది.  ఇలా ఆరు మంది ఋషి పత్నుల రూపంలో అగ్నిని ఆనందపరచి, అగ్ని వీర్యాన్ని హిమాలయాలలోని ఆ బంగారు కొలనులో విసరివేస్తుంది.  వశిష్టుని భార్య ఐన అరుంధతి రూపం మాత్రం ధరించలేకపోతుంది.

అలా విసరివేయబడిన ఆ వీర్యం ఒక బాలుడిగా రూపుదిద్దుకుంటుంది. విసరివేయబడ్డవాడు కాబట్టి ఆ బాలుడే స్కందుడుగా పేరు పొందాడు.

ఆ స్కందుడికి 6 ముఖాలు, 12 కళ్ళు, 12 చెవులు, 12 చేతులు, ఒక మెడ, ఒక ఉదరము ఉన్నాయి.

మహాభారతములోని ఈ వర్ణన, శ్రీమద్రామాయణము మరియు పురాణాలలోని కథలతో విభేదిస్తోంది.  కాబట్టి శ్రీమద్రామాయణములోని శివ పుత్రుడనే కథ బహుశ: ప్రక్షిప్తమయి (తరువాత కాలంలో చేర్చిన కథై) ఉండాలి.

కార్తికేయునికి "అగ్నిభు"  (अग्निभु) అంటే "అగ్నిపుత్రుడు" అనే పేరు కూడా ఉంది.

No comments:

Post a Comment