Saturday, 13 December 2025

రామ రాజ్యమా (లేక) సత్య, ధర్మ రాజ్యమా?

రామాయణం మనకు మార్గదర్శన గ్రంథము. యుద్ధకాండ చివరిలో వచ్చే శ్రీరాముని పాలన ఆధారంగా,  మహాత్మా గాంధి గారు రామరాజ్యం అనే నినాదం బాగా వాడారు.  అక్కడినుండి, ఆదర్శవంతమైన రాజు అంటే శ్రీరాముడు అని, ఆదర్శవంతమైన రాజ్యం అంటే శ్రీరాముడి రాజ్యంలా ఉండాలి అని చెప్పడం ప్రారంభించారు.


ఇక్కడ 2 ప్రశ్నలు ఉదయిస్తాయి - 

(1) శ్రీరాముడి తండ్రి దశరథుడు, మామ జనకుడు కూడా ధర్మమార్గంలోనే రాజ్యం చేశారు.  మరి వారినెందుకు చెప్పరు? 

(2) రాజు ఒక్కడే సత్యవంతుడు, ధర్మపరాయణుడైతే సరిపోతుందా,  ప్రజలు ఎలా ఉండాలి?

-----

రామాయణం దశరథుడి పాలనలో కూడా ప్రజలు సుఖశాంతులతో ఉన్నట్లు, బాలకాండ ఆరవ (6) సర్గలో ఉంది. అంతే కాదు, దశరథుడు సత్యవంతుడిగా, ధర్మపరాయణుడిగా మాత్రమే చెప్పలేదు.  ప్రజలు కూడా సత్యవంతులుగా, ధర్మపరాయణులుగా అక్కడ ఉంది.


తేన సత్యాభిసన్ధేన త్రివర్గమనుతిష్ఠతా । 

పాలితా సా పురీ శ్రేష్ఠా ఇన్ద్రేణేవామరావతీ ।।1.6.5।। 


సత్యసంధుడును, ధర్మమును, ధర్మమునకు లోబడి అర్థకామములను పరిరక్షించువాడును ఐన దశరథుడు, ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను. 


తస్మిన్పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతా: । 

నరాస్తుష్టా ధనైస్స్వైస్స్వైరలుబ్ధాస్సత్యవాదిన: ।।1.6.6।।


అయోధ్యలో జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి.  వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు, తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు, లోభిగుణము లేనివారు, సత్యమును పలికెడువారు. 


---


నాకు రెండు విషయాలు అర్థమైనాయి.


1. సత్యము, ధర్మములతో రాజు రాజ్యం చేయడమే కాదు, ప్రజలు కూడా సత్యము, ధర్మములతో జీవించేటట్లు, రాజు చూడాలి.


2. సత్యము, ధర్మములతో  నడుస్తున్న రాజ్యమేదైనా సత్య, ధర్మ రాజ్యమవుతుంది.  అది శ్రీరాముడి రాజ్యమైనాసరే, జనకుడి రాజ్యమైనా సరే!

No comments:

Post a Comment