శ్రీరాముని కలవక ముందే శ్రీహనుమంతుడు వేదవిద్యావిశారదుడు, సిద్ధులు కలిగిన ఒక యోగి అని శ్రీమద్రామాయణం చెబుతోంది.
1) మొదటిసారి శ్రీహనుమంతుని కలసినపుడు, అతని సంభాషణ చాతుర్యాన్ని గమనించి, శ్రీరాముడు ఇలా అంటాడు.
నాన్ ఋగ్వేద వినీతస్య నాऽయజుర్వెద ధారిణ: |
నాऽసామవేద విదుష: శక్యం ఏవ ప్రభాషితుం || (కిష్కిందకాండ 3వ సర్గ 29వ శ్లోకం)
"ఋగ్వేదమునందును, యజుర్వేదమునందును, సామవేదమునందును సుశిక్షితుడైనవాడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్ధుడు."
-----------------
శ్రీహనుమంతుడు సిద్ధులు కలిగిన ఒక యోగి అని సుందరకాండ ద్వారా మనకు పరిచయమవుతాడు.
స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు తన "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములో (పుటలు 69 - 70), శ్రీహనుమంతుడు ఒక యోగి అని ఈ క్రింది విధంగా చెబుతారు.
2) శ్రీహనుమంతుడు ఇంద్రియ పాలకులను స్తుతించి హనుమ కుండలినీ యోగమున కుపక్రమించుచు అవలంబించిన యోగాసనమును ఎట్లు వాల్మీకి చెప్పెనో ఆ చిత్రము చూడుడు.
బాహు సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ |
ససాద చ కపి: కట్యాం చరణౌ సంచుకోచ చ || (సుందరకాండ 1వ సర్గ 35వ శ్లోకం)
సంహృత్య చ భుజౌ శ్రీమన్ తథైవ చ శిరోధరం |
తేజస్సత్త్వం తథా వీర్యమావివేశ స వీర్యవాన్ || (సుందరకాండ 1వ సర్గ 36వ శ్లోకం)
"అనగా, ఆయన పరిఘములవంటి బాహువులను స్తంభింపచేసెను. కటిమీద కూర్చుండెను. చరణములను ముడుచుకొనెను. చేతులను కంఠమును ముడుచుకొనెను. ఇది యోగులు శ్రేష్ఠమని భావించు సిద్ధాసనము కావచ్చును.
తత్ప్రకారము - శిశ్నము మీద ఎడమ మడిమ చేర్చి, దానిపై కుడిమడిమ ఉంచి, కటిపై కూర్చుండి నాసాగ్రమున దృష్టి సారించుట. యద్వా- ఇది పూర్వ తాణువాసనము కావచ్చును. అది - కాలి వ్రేళ్ళు మడచి, మడమలు, పిరుదులు చేర్చి తలను చేతులతోను, నడుము మోచేతులతోను అదిమి పట్టుకొని నడుము నిక్కించుట."
3) శ్రీరాముని రూపురేఖలను, లక్షణాలను సీతకు వివరించి చెప్పి, తన గురించి శ్రీహనుమంతుడు ఇలా అంటాడు.
తస్య అహం హరిణ: క్షేత్రే జాతో వాతేన మైథిలి |
హనూమాన్ ఇతి విఖ్యాతో లొకె స్వేన ఎవ కర్మణా || (సుందరకాండ 35వ సర్గ 82వ శ్లోకం)
"ఓ సీతా! నేను కపియైన కేసరి భార్యయందు వాయువు అనుగ్రహంతో జన్మించాను. నా పనిచేత నేను లోకమున హనుమంతుడని పేరు పొందితిని."
కానీ ఆ పని ఏమిటో అచ్చట చెప్పలేదు. "హనుమంతుడు" అనగా దౌడకలవాడు అనిగాని ఎడమ దౌడ విరిగినవాడని కాదు గదా అర్థము. కనుక అది సరిపోదు. దౌడలు కలవాడు అని ఒక పేరు పెట్టుట నిరర్ధము.
స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు తన "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములో (పుట 80) ఈ క్రింది విధంగా చెబుతారు.
"హనుమత్" అనగా దౌడలు కలది. ఏది? "అంతరేణ తాలుకే య ఏషస్తన ఇవావలంబతే - సేంద్రయోని:" అని తైత్తిరీయము చెప్పినది.
తాలుకలు రెంటిమధ్య వ్రేలాడునది సుషుమ్న, అదే బ్రహ్మ ద్వారము - కనుక తాలుకావత్ అన్నచో సుషుమ్న యగును కదా - హనుమత్ అన్నను అదే.
"హనుమాన్" అని పుంలింగ శబ్దముగా నామధేయమైనది. ఒక యోగికి సుషుమ్నుడు అని పేరు పెట్టుట సార్థకము. కనుక హనుమ యోగి.
4) తను కోరుకున్నప్పుడు తన ఆకారముని పెంచుట, తగ్గించుట సిద్ధులుగా చెప్పబడుతాయి. సుందరకాండలోని ఘటనలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.
No comments:
Post a Comment