బ్రహ్మర్షి విశ్వామిత్రుని వెంట వెళ్ళిన శ్రీరాముడు మిధిలలో శివ ధనుర్భంగము చేసి, సీతను పెళ్ళిచేసుకున్నట్లు శ్రీమద్రామాయణంలోని బాలకాండలో ఉంది.
ఐతే దీనికి కొంచెం వేరుగా, శ్రీరాముడు మిధిలలో వరుణ (వర్షము/జలమునకు అధిపతి) ధనుర్భంగము చేసి, సీతను పెళ్ళిచేసుకున్నట్లు శ్రీమద్రామాయణంలోని అయోధ్యకాండలో ఉంది.
మహా యజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మనా |
దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీ చ అక్షయ సాయకౌ || (అయోధ్యకాండ 118వ సర్గ 39వ శ్లోకం)
"ఒక మహాయజ్ఞము చేయుచుండగా, మహాత్ముడైన వరుణుడు ప్రసన్నుడై, ఒక దివ్యధనుస్సును, అక్షయబాణములతో ఒప్పుచుండెడి రెండు తూణీరములను (అమ్ముల పొదులను) జనకునకు అనుగ్రహించెను."
అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేన అపి చ గౌరవాత్ |
త న్న శక్తా నమయితుం స్వప్నేషు అపి నరాధిపా: || (అయోధ్యకాండ 118వ సర్గ 40వ శ్లోకం)
"ఎంతటి బలశాలురైన మానవులుసైతము, తమ సర్వశక్తులనూ ఒడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనుస్సును ఏ మాత్రమూ కదల్పజాలక పోయిరి. మహారాజులు తమ స్వప్నములలో కూడ దానిని ఎక్కుపెట్టుటకు అశక్తులగుచుండిరి."
శ్రీమద్రామాయణంలోని బాలకాండలో ఉన్న ఈ శివ ధనుర్భంగ ఘట్టము తరువాతి కాలంలో శైవులచే కానీ, పరశురాముని దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సు ఆధిపత్యాన్ని నిరూపించడం కోసం వైష్ణవులద్వారా కానీ, చేర్చబడిన ప్రక్షిప్తం అయి ఉండాలి.
No comments:
Post a Comment