శ్రీహనుమంతుడు "రామ" నామ జపం చేసి, శ్రీరాముని సేవించి, ఆరాధించి సర్వశక్తులు పొందాడని, శ్రీరాముని ఆశీర్వాదంవల్ల చిరంజీవి అయ్యాడని, అతడు భవిష్యద్ బ్రహ్మ అవుతాడని శ్రీరాముడిచ్చిన వరమని ప్రచారంలో ఉన్న విషయం.
శ్రీమద్రామాయణం ఎన్నిసార్లు చదివినా పైన ఉటంకించిన విషయాలకు నాకు ఆధారాలు దొరకలేదు. శ్రీమద్రామాయణం తప్ప (శ్రీమద్రామాయణంలో ఉత్తరకాండ ప్రక్షిప్తమని చాలామంది పెద్దలు నిరూపించారు కాబట్టి, ఆ కాండను కూడా మినహాయించి), వేరొక భాష్యంగానీ, పురాణంగానీ ప్రమాణంగా తీసుకొని పైన చెప్పిన విషయాలను సమర్థించే ప్రయత్నం నాకు నచ్చదు.
దీని అర్థం శ్రీరాముని తక్కువ చేయడమసలేకాదు. శ్రీరాముని మించిన ఉత్తమ, ఆదర్శపురుషుడు వేరొకడు లేడు. ఐతే శ్రీరాముని ఔన్నత్యాన్ని పెంచడానికి శ్రీహనుమంతుని పాత్రని తగ్గించి (లేదా) మార్చి చూపవలసిన అవుసరం లేదు కద!
శ్రీరాముని గురువుగా ఇంకొక వ్యక్తి సేవించి, ఆరాధించాడని శ్రీమద్రామాయణంలో ఆధారముంది.
-------------------
1) శ్రీహనుమంతుడు సీతను వెతుకుతు లంకకు చేరి అశోకవనంలో శింశుప వృక్షంపై దాగి ఉండి, సీత దయనీయ పరిస్థితిని గమనించి ఈ విధంగా చింతిస్తాడు.
మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా |
యది సీతా అపి దు:ఖ ఆర్తా కాలో హి దురతిక్రమ: ||
(సుందరకాండ 16వ సర్గ 3వ శ్లోకం)
"గౌరవింపదగినది, పెద్దలచేత శిక్షణ పొందినది, లక్ష్మణుని గురువుకు (శ్రీరామునికి) ప్రియమైనది (లక్ష్మణస్య గురు ప్రియా) అగు సీతయే ఇట్లు దు:ఖార్తాయైనచో కాలమెంత అనుల్లంఘనీయమో"
ఇక్కడ శ్రీహనుమంతుడు "లక్ష్మణుని గురువుకు ప్రియమైనది అగు సీత" అని అంటున్నాడు. సీత శ్రీరామునికి ప్రియమైనది. కాబట్టి లక్ష్మణుని గురువు శ్రీరాముడే!
ఇక్కడ ఒక విషయం గమనించాలి.
శ్రీహనుమంతుడు శ్రీరాముని భక్తుడైఉంటే, శ్రీరామనామ జపం చేస్తూ ఉండి ఉంటే "లక్ష్మణస్య గురు ప్రియా" అనడు, "మమ గురు ప్రియా" అని ఉండేవాడు.
శ్రీరాముడు లక్ష్మణునికన్నా ముందు పుట్టడంవల్లగాక, శ్రీరాముని ఉత్తమ, ఆదర్శ జీవనం వల్ల ప్రభావితుడై లక్ష్మణుడు ఆయనను గురువుగా భావించి, ఆరాధించి, సేవిస్తూ ఉండవచ్చును.
(లేదా)
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు శ్రీరామునికి మాత్రమే తెలిపిన బ్రహ్మాస్త్ర ప్రయోగం, లక్ష్మణునికి కూడా తెలుసును. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు శ్రీరామునికి ప్రసాదించిన అస్త్రాలన్ని, శ్రీరాముడు లక్ష్మణునికి ప్రసాదించి ఉండడంవల్ల, శ్రీరాముని గురుత్వభావంతో సేవిస్తూ ఉండవచ్చును.
----
ఇంద్రజిత్తు అదృశ్యుడై యుద్ధం చేస్తూ చాలమంది వానరులను చంపి, శ్రీరామలక్ష్మణులను తీవ్రంగా గాయపరిచినపుడు, లక్ష్మణుడు ఈ విధంగా అంటాడు.
లక్ష్మణస్తు సుసంకృద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ |
బ్రాహ్మమస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరక్షసాం ||
(యుద్ధకాండ 80వ సర్గ 37వ శ్లోకం)
అంతట లక్ష్మణుడు మిగుల క్రుద్ధుడై అన్నతో "సమస్త రాక్షసులను సంహరించుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెదను".
-----
2) శ్రీహనుమంతుని రావణునిగా అనుమానించి, శ్రీరాముని లక్షణాలను, రూపురేఖలను చెప్పమని సీత అడిగినపుడు, శ్రీ హనుమంతుడు ఈ విధంగా అంటాడు.
కుశలీ తవ కాకుత్స్థ: సర్వ శస్త్రభృతాం వర: |
గురో: ఆరాధనే యుక్తో లక్ష్మణ: చ సులక్షణ: || (సుందరకాండ 35వ సర్గ 74వ శ్లోకం)
"శస్త్రముల ప్రయోగములో మేటి అయిన నీ భర్త శ్రీరాముడు క్షేమమే! తన గురు (ఐన శ్రీరాముని) సేవలో నిమగ్నమైన లక్ష్మణుడు కూడా క్షేమమే!"
ఇక్కడ కూడా శ్రీ హనుమంతుడు, గురుసేవలో నిమగ్నుడైఉన్న లక్ష్మణుడు అని అంటున్నాడు.
No comments:
Post a Comment