ఈ ప్రశ్న చాలా మూర్ఖంగా అనిపించవచ్చును. ఎందుకంటే పురాణాలలో ఉన్న కార్తికేయ జననం చదివినవారికెవరికైనా ఇలాగే అనిపిస్తుంది.
ఐతే ఈ ప్రశ్న బాగా ఆలోచించే వేసినదని మనవి. ఎందుకంటే వేదాలు, శ్రీమద్రామాయణం, మహాభారతంలతో పోలిస్తే, పురాణాలు నవీనమనే చెప్పాలి. శ్రీమద్రామాయణంలో ఉన్న మన్మథ అంతం కథ పురాణాలకి భిన్నంగా ఉంటుంది.
పురాణాల ప్రకారం శివుని కుమారునివల్ల తప్ప మరెవ్వరి చేతిలో మరణం లేకుండా వరం పొంది, లోకాలను అల్లకల్లోలం చేస్తున్న తారకాసురుని సంహరించాలంటే, సుదీర్ఘమైన తపస్సులో ఉన్న శివుని సంసారంలోకి దింపాలి. అందుకు ఇంద్రుని ప్రోత్సాహంతో మన్మథుడు బయలుదేరివెళ్ళి, తన పూల బాణాలు ప్రయోగించడంవల్ల, తపస్సు భంగమై శివుడు, మూడవ కంటితో మన్మథుని భస్మం చేస్తాడు.
శ్రీమద్రామాయణంలో ఉన్న మన్మథ అంతం కథ దీనికి భిన్నంగా ఇలా ఉంటుంది.
---------------
దశరథుడు విశ్వామిత్రుని కోరిక మేరకు శ్రీరాముని యజ్ఞ సంరక్షణకొఱకు పంపుతాడు. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులతో బయలుదేరి, గంగా సరయు నదుల సంగమ ప్రాంతానికి చేరి, ఆ రాత్రి అక్కడే విశ్రమిస్తాడు.
ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఆశ్రమం చూసి, శ్రీరాముడు అది ఎవరిదని అడుగుతాడు. విశ్వామిత్రుడు ఇలా చెబుతాడు.
కందర్పో మూర్తిమాన్ ఆసీత్ కామ ఇతి ఉచ్యతే బుధై: |
తపస్యంతం ఇహ స్థాణుం నియమేన సమాహితం ||
కృత ఉద్వాహం తు దేవేశం గచ్ఛంతం స మరుద్గణం |
ధర్షయామాస దుర్మేధా హుం కృతశ్చ మహాత్మనా ||
అవదగ్ధస్య చ రౌద్రేణ చక్షుషా రఘు నందన |
వ్యశీర్యంత శరీరాత్ స్వాత్ సర్వ గాత్రాణి దుర్మతే: || (బాలకాండ 23వ సర్గ 10-13 శ్లోకములు)
"సుందరమైన శరీరము గల 'కందర్పుడు' అను వాడు గలడు. అతనిని పండితులు 'కాముడు' అని పిలుతురు. ఒకానొకప్పుడు 'స్థాణుడు' ఇచ్చట సమాధినిష్టుడై అవిచ్చిన్నముగా తపమాచరించుచుండెను.
ఆ సమయమున దుర్భుద్ధియైన కాముడు, వివాహము చేసుకుని, మరుద్గణములతో వచ్చుచున్న 'దేవేశుని" ఎదిరించగా, దుర్భుద్ధియైన కాముని చూచి దేవేశుడు హుంకరించెను. ఆ హుంకరింపుకు కాముడు అంగములు నేలరాలినవాడై నశించెను.
'స్థాణుడు' ఇచ్చట సమాధినిష్డుడై అవిచ్చిన్నముగా తపమాచరించుటచే ఈ ఆశ్రమం పవిత్రమైనది."
-----------------
ఇక్కడ మహర్షి వాల్మికి వర్ణించిన విషయాలను విడివిడిగా గమనించాలి.
1. 'స్థాణుడు' ఇచ్చట సమాధినిష్టుడై అవిచ్చిన్నముగా తపమాచరించుచుండెను.
ఈ 'స్థాణుడు' ఎవరో మహర్షి వాల్మికి చెప్పలేదు. ఆనాటికి "శివుడు" అనే దేవుడు లేడు కాబట్టి, ఈ 'స్థాణుడు' ఎవరైనా ఒక ఋషి అయిఉండాలి (లేదా) దేవతలలో ఒక్కడైన "రుద్రుడు" అయిఉండాలి.
2. వివాహము చేసుకుని, మరుద్గణములతో కలసి 'దేవేశుడు" ఆ ప్రాంతానికి వచ్చాడు.
3. దుర్భుద్ధియైన కాముడు 'దేవేశుని" ఎదిరించాడు.
4. 'దేవేశుడు" హుంకరించగా కాముడు అంగములు నేలరాలినవాడై నశించెను.
మరుద్గణములతో కలసి వస్తున్న 'దేవేశుడు" అనే విషయాన్ని వేదకాలంనాటి దేవతలను దృష్టిలో పెట్టుకుని పరిశీలించాలి, ఎందుకంటే శ్రీమద్రామాయణములో వేదకాలంనాటి దేవతల ఆరాధనే కనబడుతుంది.
I) వేదకాలంలో దేవతలకు రాజు/ఈశుడు ఇంద్రుడే. బ్రహ్మను "పితామహుడు"గా గౌరవించేవారు. శివుని ప్రస్తావన కనిపించదు. విష్ణువు ప్రస్తావన ఉన్నా అది ఇంద్రుడి కన్నా తక్కువగానే కీర్తిస్తూ కనిపిస్తుంది.
II) క్షీరసాగరమథన సమయంలో జరిగిన యుద్ధంలో తన పుత్రులైన దైత్యులందరు మరణించగా, దితి దు:ఖించి తన భర్తైన కాశ్యపుని ప్రార్థించి, ఇంద్రుని చంపే కొడుకు కోసం గొప్ప తపస్సు ప్రారంభిస్తుంది. ఐతే ఆ తపస్సులో పాటించవలసిన నియమం సరిగ పాటించనందుకు ఆమె అపవిత్రురాలవుతుంది.
ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని 7 ముక్కలుగా నఱుకుతాడు. ఐతే ఆ పిండం మరణించదుకానీ, ఏడుగురు మగపిల్లలు పుడతారు. వారే మరుద్గణములు. వారు తనతో కలసి తిరుగుతు ఉండేటట్లు ఇంద్రుడే వరం ఇస్తాడు.
II) క్షీరసాగరమథన సమయంలో జరిగిన యుద్ధంలో తన పుత్రులైన దైత్యులందరు మరణించగా, దితి దు:ఖించి తన భర్తైన కాశ్యపుని ప్రార్థించి, ఇంద్రుని చంపే కొడుకు కోసం గొప్ప తపస్సు ప్రారంభిస్తుంది. ఐతే ఆ తపస్సులో పాటించవలసిన నియమం సరిగ పాటించనందుకు ఆమె అపవిత్రురాలవుతుంది.
ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని 7 ముక్కలుగా నఱుకుతాడు. ఐతే ఆ పిండం మరణించదుకానీ, ఏడుగురు మగపిల్లలు పుడతారు. వారే మరుద్గణములు. వారు తనతో కలసి తిరుగుతు ఉండేటట్లు ఇంద్రుడే వరం ఇస్తాడు.
III) కాబట్టి మరుద్గణములతో కలసి వస్తున్న 'దేవేశుడు" ఇంద్రుడేగానీ, శివుడు కాదు. మన్మథుని నశింప చేసినది ఇంద్రుడేగానీ శివుడు కాదు.
No comments:
Post a Comment