ప్రాచుర్యంలో ఉన్న చలనచిత్ర/పౌరాణిక కథల ప్రకారం (i) ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంది. దాని ప్రకారం అతను 14 సంవత్సరములు నిద్రించకుండా ఉన్నవాడిచేతిలోనే మరణిస్తాడు. (ii) లక్ష్మణుడు 14 సంవత్సరములు నిద్రించలేదు. తన నిద్రను కూడా తన భార్యయైన ఊర్మిళకు ఇచ్చి, తాను 14 సంవత్సరములు మేలుకుని శ్రీరాముని సేవ చేసాడు. అందువలననే అతను ఇంద్రజిత్తును చంపగలిగాడు.
ఐతే వాల్మీకి రామాయణం ప్రకారం, లక్ష్మణుడు అరణ్యంలో ఏమరుపాటు లేకుండా జాగరూకుడై ఉన్నాడు కానీ నిద్రించాడు.
----------------------
అథ రాత్ర్యాం వ్యతీతాయాం అవసుప్తం అనంతరం |
ప్రబోధయాం ఆస శనై: లక్ష్మణం రఘునందనహ: || (అయోధ్యకాండ 56వ సర్గ 1వ శ్లోకము)
ఆ రాత్రి గడచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్రనుండి లేచి, అచట పండుకునియున్న లక్ష్మణుని నెమ్మదిగా జాగృతుని గావించి ఇట్లు పలికెను.
సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం |
సంప్రతిష్ఠామహే కాల: ప్రస్థానస్య పరంతప || (అయోధ్యకాండ 56వ సర్గ 2వ శ్లోకము)
"ఓ సౌమిత్రి! వనములో నివసించు పక్షుల మధుర స్వరములను వినుము. ప్రయాణమునకు ఇది తగిన సమయము. ఇచట నుండి బయలుదేరుదుము."
స సుప్త: సమయే భ్రాత్రా లక్ష్మణహ: ప్రతిబోధిత: |
జహౌ నిద్రాం చ తంద్రీం చ ప్రసక్తం చ పథి శ్రమం|| (అయోధ్యకాండ 56వ సర్గ 3వ శ్లోకము)
అంతవరకు నిద్రిస్తున్న లక్ష్మణుడు అన్న హెచ్చరికతో జాగరూకుడై లేచెను. ప్రయాణపు బడలికను తీర్చుకొనెను.
No comments:
Post a Comment