Tuesday, 15 September 2015

బాలకాండ పాక్షికంగా ప్రక్షిప్తమా? (భాగం - 3)


II)       వాల్మీకి మహర్షి శైలి: కథకు సంబంధం లేకపోయినా  ఉప కథలు చొప్పించడం

శ్రీమద్రామాయణంలోని అయోధ్యకాండ నుండి యుద్ధకాండ వరకు మూలకథ చదివిన వారెవరికైనా,  ప్రధాన కథకు సంబంధం లేని ఉపకథలను వాల్మీకి మహర్షి చొప్పించే ప్రయత్నమేమి చేయలేదని అర్థమవుతుంది.

(i) అయోధ్యకాండలో అత్రి మహర్షి అనసూయ గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోకానీ, (ii) అరణ్యకాండలో సుగ్రీవుని కలవమని చెప్పిన కబంధుని కథ చెప్పినపుడుకానీ, (iii) కిష్కందకాండలో వాలి సుగ్రీవుల మధ్య ఘర్షణ ఎందుకు ప్రారంభమయ్యిందో చెప్పే  సందర్భంలోకానీ, (iv) కిష్కందకాండలోనే శ్రీహనుమ చరిత్ర చెప్పినపుడుకానీ  వాల్మీకి మహర్షి వీలైనంత క్లుప్తంగా వివరించారు.
----------------

ఐతే ఈ శైలికి భిన్నంగా, బాలకాండలో మాత్రం అనేక సందర్భాలలో, ప్రధాన కథకు సంబంధం లేని ఉపకథలను మనం చూడవచ్చును.
1)  గొప్ప తపస్వీఐన ఋష్యశృంగుని  తీసుకునివచ్చి, ఆయన ద్వారా అశ్వమేథయాగం చేయించాలనుకుంటారు.  ఆ సందర్భంలో ఋష్యశృంగుని కథను 9,10,11 సర్గలలో (మూడు సర్గలు) చెప్పబడింది.  ఈ కథలు శ్రీరామ కథకు సంబంధంలేనివి.  కాబట్టి ఈ 3 సర్గలు ప్రక్షిప్తమనవచ్చును.

2)  పుత్రకామేష్టియాగం గురించి వివరించిన 15 నుండి 17 సర్గలు  ప్రక్షిప్తమని ఇదివరకే వివరించాను.

3)  35 నుండి 47 సర్గలలో (i) గంగా, ఉమల పుట్టుక, (ii) హిమవంతుడు గంగను దేవతలకు ఒప్పచెప్పడం, (iii) శివ పార్వతుల వివాహం, (iv) కార్తికేయుని పుట్టుక, (v) సగరుడు అశ్వమేథయాగం చేస్తూండగ ఇంద్రుడు యాగాశ్వాన్ని ఎత్తుకుని పోవడం, (vi) సగర పుత్రులు భూమినంతా త్రవ్వడం, ఆ క్రమంలో కపిల మహర్షి చేతిలో బూడిదైపోవడం, (vii)  సగర పుత్రులకు ఉత్తమ గతులను ఆశించి, భగీరథుడు తపస్సు చేసి గంగను భూమి మీదకు తీసుకుని రావడం, (viii) క్షీరసాగర మథనం కథ, (ix) ఇంద్రుని చంపే కుమారుని కోసం  దితి  వ్రతాన్ని ఆచరించడం, మరుత్తగణాల పుట్టుక వర్ణించబడ్డాయి.

ఈ కథలు శ్రీరామ కథకు సంబంధంలేనివి.  కాబట్టి ఈ 13 సర్గలు ప్రక్షిప్తమనవచ్చును.

4)     బాలకాండలోని 51 నుండి 65 సర్గలవరకు గౌతమ మహర్షి, అహల్యల కుమారుడైన శతానందుడు, శ్రీరామలక్ష్మణులకు విశ్వామిత్రుని కథను వర్ణిస్తాడు.  ఇందులోనే (i) బ్రహ్మర్షి వశిష్టుడికి రాజైన విశ్వామిత్రునికి మధ్య ఘర్షణ కలగడం, (ii) బ్రహ్మర్షి వశిష్టుని చేతిలో విశ్వామిత్రుని ఓటమి, (iii) తాను కూడా బ్రహ్మర్షిని అవ్వాలనుకుని విశ్వామిత్రుడు ఘోరతపస్సుకు దిగడం, (iv) ఆయన తపస్సు చేసే సమయంలో త్రిశంకువు, శునశ్శేపుడు, మేనక, రంభ ఆయన దగ్గరకు రావడం, మొదలైన కథలన్నీ ఈ సర్గలలో ఉంటాయి.

ఈ కథలు శ్రీరామ కథకు సంబంధంలేనివి.  కాబట్టి ఈ 15 సర్గలు ప్రక్షిప్తమనవచ్చును.

5)    బాలకాండ 75 - 77 సర్గలలో శ్రీరాముడు వరుణ ధనస్సును విరిచిన విషయం తెలిసి, జమదగ్ని కుమారుడైన పరశురాముడు శ్రీరాముని ఎదిరించడం, పరశురాముని ఓటమి కథ ఉంది.

పరశురాముడు విష్ణువవతారంగా నిరూపించే ప్రయత్నంలో చొప్పిన కథ ఇది అని ఇంతకు ముందే వ్రాసాను.  కాబట్టి 75 -77 సర్గలు కూడా ప్రక్షిప్తమే!

వెరసి బాలకాండలోని పైన వివరించిన 41 సర్గలు ప్రక్షిప్తమే!


III)     వాల్మీకి మహర్షి కీర్తించిన  వేదకాలపు దేవతారాధన పద్ధతులతో సంబంధంలేని విధంగా ఇతర దేవతలను కీర్తిస్తూ ఉన్న ఘట్టాలు కూడా,  అంటే విష్ణువును/శివుని దేవాధిదేవుడిగా కీర్తిస్తూ ఉన్న సంఘటనలు   పైన చెప్పిన  ప్రక్షిప్త సర్గలలోనే ఉన్నాయి.

విష్ణువు అవతారాలుగా కపిల మహర్షిని, శ్రీరాముని, పరశురాముని కీర్తించే ఘట్టాలు, క్షీరసాగర మథనం ఘట్టంలో విష్ణువును, శివుని దేవాధిదేవులుగా కీర్తిస్తూ ఉండడం, ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చును.

IV)     బాలకాండలో మిగిలిన 37 సర్గలను అయోధ్యకాండకు ముందు కలిపి, ఒకే కాండగా (అయోధ్యకాండ) చేసి, చదువుకుంటే వాల్మీకి రామాయణంలో 5 కాండలు మాత్రమే మిగులుతాయి.    ప్రస్తుత బాలకాండలోని 5వ సర్గతో అయోధ్యకాండ మొదలవుతుంది.

1.  అయోధ్యకాండ, 2. అరణ్యకాండ, 3. కిష్కిందకాండ , 4. సుందరకాండ, 5. యుద్ధకాండ.



No comments:

Post a Comment