Thursday, 3 September 2015

వేదకాలంనాటి ఆరాధన పద్ధతులకి, శైవం, వైష్ణవం వంటి మతాల ఆరాధన పద్ధతులకి తేడా (భాగం- 1)

పైపైన చూసినవారికి వేదాలలోని స్తోత్రాలు  ప్రకృతి అంటే అర్థంకాక భయపడి, చేసిన పంచభూత కీర్తనల్లా అనిపిస్తుంది.  ఎందుకంటే ఆ కాలంలో యజ్ఞాలు చేయడం, అగ్నిద్వారా హవిస్సులు దేవతలకు ఇవ్వడం, విశ్వామిత్రుడులాంటి ఋషులు తపస్సు చేయడం, ప్రజలు ఋషులు బోధించిన ధర్మమార్గం అనుసరించడం తప్ప వేరేమి కనిపించవు.

శైవం, వైష్ణవం వంటి మతాల  ఆరాధన పద్ధతులలో ఉండే విగ్రహారాధన, భజనలు, ఆర్భాటంగా చేసే పూజలు, హోమాలు,మఠాధిపతులు,మఠాల స్థాపన, నిర్వహణ వంటివి వేదకాల ప్రజల జీవనాలలో కనిపించవు.

----------

తైత్తరీయ ఉపనిషత్తులోని "శిక్షావల్లి"లోని  మొదటి అనువాకంలోని 2వ శాంతి మంత్రంలో పైకి పంచభూతాలలో ఒకటైన వాయువు ఆరాధనలా కనిపించినా, కొద్ది లోతుల్లోకి వెళ్ళి పరిశిలిస్తే అది అద్వైతానుభూతితో చెప్పిన స్తోత్రంలా అర్థమవుతుంది.

నమో బ్రహ్మణే |  నమస్తే వాయో |
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి |
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి |
ఋతం వదిష్యామి |  సత్యం వదిష్యామి |

"బ్రహ్మకు నమస్కారము!  వాయువుకు నమస్కారము!  నీవే (ఓ వాయువు!)  కనిపించే బ్రహ్మవు!  నీవే కనిపించే బ్రహ్మవని నేను ప్రకటిస్తున్నాను! ఈ సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను!  సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను!"

ఇక్కడ మన లోపల, బయట వ్యాపించి, మనకు జీవనాధారమైన, మన సర్వకర్మలకు, మనోభావాలకు సాక్షి ఐన వాయువును పరబ్రహ్మగా అనుభవపూర్వకంగా గుర్తించి, స్తోత్రం చేయబడింది.

No comments:

Post a Comment