శ్రీసీతారామలక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించారనే వార్త తెలిసిన తరువాత, కౌసల్య ఏడుస్తూ దశరథుని నిందిస్తుంది. దు:ఖం మనస్సుని పిండేస్తూంటే దశరథునికి తాను చిన్నతనంలో చేసిన తప్పు గుర్తుకువస్తుంది.
దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒకరోజు వేటకు వెళ్ళి, సంధ్యాసమయంలో ఒక ముని కుమారుడు నీరు తీసుకుని వెళ్ళడానికి నదికి వచ్చి, నీటిలో కడవ ముంచినపుడు వచ్చిన శబ్ధాన్ని, ఏనుగు నీరు త్రాగుతోందనుకుని, చాటునుండి బాణప్రయోగం చేస్తాడు. ఆ బాణం ఆయువుపట్టులో తగలడంతో ఆ ముని కుమారుడు ఆర్తనాదం చేస్తాడు.
దశరథుడు భయంతో వణికిపోయి క్రిందపడి ఉన్న ఆ ముని కుమారుడి దగ్గరకు వెళ్ళి తన తప్పు ఒప్పుకుంటాడు. భయపడిపోతున్న దశరథని ఆ ముని కుమారుడు అంత బాధలోను ఓదారుస్తూ, తను బ్రాహ్మణ కుమారుడను కానని, కాబట్టి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమోనని భయపడవద్దని అంటాడు.
న ద్విజాతిరహం రాజన్ మాభూత్ తే మనసో వ్యథా |
శూద్రాయామస్మి వైశ్యేన జాత: జనపదాధిప || (అయోధ్యకాండ 63వ సర్గ 50వ శ్లోకము)
"ఓ మహారాజ! నేను బ్రాహ్మణుడనుకాను. వైశ్యునివలన శూద్రస్త్రీయందు జన్మించినవాడను. మనోవ్యథకు ఏమాత్రము గుఱికావలదు."
తరువాత ఆ మునికుమారుడు మరణిస్తాడు. ఆ ముని కుమారుడి తండ్రి పుత్రశోకంతో తన మాదిరిగానే దశరథుడు కూడా మరణిస్తాడని శపించి, భార్యతో కలసి మరణిస్తాడు.
------------------------------------
ఈ కథ వలన క్రింద వివరించిన విషయాలు మనకు అర్థమవుతాయి.
1. మనిషి ఎంతటి ధర్మపరుడైనా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసినదే. ధర్మకార్యచరణము వలన అధర్మకార్యఫలము నశింపదు.
2. పుత్రులు లేరని అశ్వమేథయగం దశరథుడు చేస్తాడు. దానికి ఫలితంగా సంతానం పొందాడుకానీ ముని శాపాన్ని తప్పించుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని శ్రీహనుమ ద్వారా వాల్మీకి మహర్షి మఱియొకమారు లోకానికి హితవు పలికాడు.
శ్రీహనుమ రావణునితో సంవాదం చేస్తున్నపుడు ఇలా అంటాడు.
న తు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం ||
తత్ ఏవ ఫలం అన్వేతి ధర్మ: చ అధర్మ నాశన: | (సుందరకాండ 51వ సర్గ 29వ శ్లోకము)
"ధర్మఫలము, అధర్మఫలము ఎప్పుడునూ కలిసియుండవు. ధర్మకార్యము శుభఫలమును, అధర్మకార్యము అశుభఫలమును ఇచ్చును. ధర్మకార్యచరణము వలన అధర్మకార్యఫలము నశింపదు."
ప్రాప్తం ధర్మ ఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయ:||
ఫలం అస్య అపి అధర్మస్య క్షిప్రం ఏవ ప్రపత్స్యసే| (సుందరకాండ 51వ సర్గ 30వ శ్లోకము)
"నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది. ఇందు ఏమాత్రము సందేహము లేదు. ఇప్పటి నీ అధర్మఫలముని శీఘ్రముగానే పొందగలవు."
3. ఆ మునికుమారుడు వైశ్యునివలన శూద్రస్త్రీయందు జన్మించాడు. వారు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నారు. ఆనాటి కాలంలో వేరు వేరు వర్ణాలవారు వివాహమాడటం సమాజంలో నేరం కాదు. వారు తపస్సు చేయడంకూడా నేరం కాదు.
-----------------------------------
No comments:
Post a Comment