Wednesday, 2 September 2015

ఆర్యులెక్కడివారు?

నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను "ఆర్యులు" అనే పదం, ఒక తెగకు సంబంధించినది జరిగినదిగా వినడం, చదవడం వల్ల, నాలో కూడ "ఆర్యులు" ఎక్కడో మధ్య ఆసియా నుండి వచ్చి, ఇక్కడ ఉండే ద్రావిడులను తరిమివేసి, ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డారనే భావం బలపడింది.

ఐతే తరువాతి కాలంలో శ్రీమద్రామాయాణం చదువుతున్నపుడు "ఆర్య" పదం చాల సన్నివేశాలలో ప్రయోగింపబడగా చదివాను.  అన్ని సన్నివేశాలలో కూడ "ఆర్య" పదం ఒక ఉన్నతమైన భావాలుగలవారిని, సాహసంగలవారిని, ఉత్తమ కార్యాలను చేసేవారిని సూచించడం గమనించాను.

క్రింద ఉటంకించిన 3 ఉదాహరణలు గమనించగలరు.

1)     శ్రీరాముడు ప్రయోగించిన శస్త్రధాటికి వాలి నేలగూలుతాడుగానీ ఇంకా ప్రాణముంటుంది.  ఆ వార్తను విని వాలి భార్య తార పరుగు పరుగున భర్త దగ్గరకు చేరుకుని, నేలబడిపోయి, తేరుకుని ఈ విధంగా రోధిస్తుంది.

సుప్తా ఇవ పునరుత్థాయ ఆర్య పుత్ర ఇతి వాదినీ|
రురోద సా పతిం దృష్ట్వా సంవీతం మృత్యు దామభి: ||  (కిష్కిందకాండ 19వ సర్గ 27వ శ్లోకం)

"పిదప తార నిద్రనుండి మేల్కొనినదానివలె లేచి "ఆర్యపుత్రా" అని, మృత్యుపాశములచే బంధింపబడిన తన పతిని జూచి, విలపించెను".

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, వానరులు శ్రీమద్రామయణ కాలంనాటికే గోదావరికి క్రింద అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు.

బ్రిటిష్‌వారు సృష్టించిన "ఆర్యసిద్ధాంతం" నిజమయితే  గోదావరికి క్రింద అడవి ప్రాంతంలో నివసిస్తున్న వానర స్త్రీ తన భర్తను "ఆర్యపుత్రా" అని పిలువదు.

ఇక్కడ "ఆర్యపుత్రా" అనే ప్రయోగం ఉన్నత విలువలు పాటించిన  ఋక్షరజసుని కుమారునిగా సంబోధన మాత్రమే!

2)   కుంభకర్ణుడు యుద్ధరంగంలో భీకరమైన శరీరంతో, భయంకరమైన తన శూలంతో యుద్ధం చేస్తూంటే వానరులు భయంతో పరుగులు తీస్తారు.  అప్పుడు వారిని వారిస్తూ, వానర యువరాజైన అంగదుడు ఇలా అంటాడు.

కులేషు జాతా: సర్వే స్మ విస్తీర్ణేషు మహత్సు చ ||
క్వ గచ్చ్హత భయత్రస్తా: ప్రాకృతా హరయో యథా |
అనార్యా: ఖలు యద్భీతాస్త్యక్త్వా వీర్యం ప్రధావత || (యుద్ధకాండ 66వ సర్గ 21-22 శ్లోకములు)

"ఉత్తమ కులాలలో పుట్టిన, తిరుగులేని పరాక్రమశాలులైన వానరులారా!  మీ పరాక్రమము మఱచి, సామాన్యులవలె ఆయుధములను పరిత్యజించి, యుద్ధరంగము నుండి అనార్యులవలె ఎక్కడికి పాఱిపోవుతున్నారు? ఇది మీ వంటి వీరులకు తగనిపని"

అంగదుడు అనార్యులవలె ఎక్కడికి పాఱిపోవుతున్నారు? అని అంటున్నాడు.  అంటే వానరులు సాహసవంతులైన "ఆర్యులు" అని, పిఱికితనంతో పాఱిపోవుట "అనార్య" లక్షణమని అర్థం.  ఇక్కడ కూడా "ఆర్య" అనే పదం ఒక జాతిని ఉద్ధేశించి వాడబడలేదని గమనించాలి.


3)   శ్రీహనుమంతుడు సీతను వెతుకుతు లంకంతటా తిరిగి, చివరకు రానణుని మందిరం చేరుతాడు.  అక్కడ రానణుని చూసి, రానణుని గొప్ప తపస్సును గుర్తుచేసుకుని ఇలా అనుకుంటాడు.

పునశ్చ సొ అచింతయద్ ఆర్త రూపో |
ధ్రువం విశిష్టా గుణతో హి సీతా |
అథ అయం అస్యాం కృతవాన్ మహాత్మా |
లంకా ఈశ్వర: కష్టం అనార్య కర్మ || (సుందరకాండ 9వ సర్గ 73వ శ్లోకం)

"సీత ఉత్తమ గుణసంపన్నురాలు.  ఇది ముమ్మాటికిని నిజము. లంకేశ్వరుడైన రావణుడు మహాత్ముడు (రానణుడు గొప్ప తపస్సు చేసినవాడు).  ఐనా తన స్థాయికి తగనట్లు సీతాపరణ అనే అనార్య (అనుచిత) కర్మను చేసాడు." అని శ్రీహనుమంతుడు దు:ఖితుడాయెను.

ఇక్కడ శ్రీహనుమంతుడు లంకాధిపతియైన రావణుని అనార్యుడని అనడంలేదు.  రావణుడు మహాత్ముడని, ఉత్తమవంశంలో పుటినవాడని, అటువంటివాడు ఇటువంటి అనార్య (అనుచిత) కార్యం ఎందుకు చేసాడోనని, శ్రీహనుమంతుడు  దు:ఖిస్తున్నాడు.

అంటే ఇక్కడ "అనార్య" పదం అనుచిత కార్యాన్ని సూచిస్తూ వాడబడినదిగానీ, ఒక జాతిని ఉద్దేశించి వాడబడలేదు.

No comments:

Post a Comment