విష్ణుసహస్రనామం చివరలో, శివపార్వతుల సంవాదం ఉంటుంది. పండితులు ప్రతిరోజూ పఠించే శ్రీ విష్ణువు యొక్క 1,000 నామాలను చెప్పడానికి సులభమైన మార్గం చెప్పమని పార్వతి అడిగినపుడు శివుడు ఇలా అంటాడు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥
నేను రాముని ధ్యానంలో ఆనందం పొందుతాను మరియు శ్రీరామ రామ రామ అని చెప్పడం శ్రీ విష్ణువు యొక్క వేయి నామాలను ఉచ్చరించడంతో సమానం.
రమ్యతే అనేన ఇతి రామః - అందరికి నచ్చేవాడు రాముడు.
----
విష్ణుసహస్రనామం వ్యాసమహర్షి రచించిన మహాభారతంలోని అనుశాసన పర్వంలో కనిపిస్తుంది. మహాభారతంలోని వన పర్వంలో శ్రీరామ కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వినిపిస్తాడు.
నాకు కలిగిన సందేహమేమంటే, శ్రీరామ రామ రామేతి అని శ్రీరామ నామ ఔన్నత్యాన్ని మొదటగా వ్యాసమహర్షియే చెప్పారా లేక ఇంక ఎవరైనా చెప్పారా అని?
---
దీనికి సమాధానం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోనే కనిపిస్తుంది.
శింశుప వృక్షం పైనుండి శ్రీహనుమంతుడు శ్రీరామ కథను వినిపించినపుడు, సీత శ్రీహనుమంతుని చూచి అది కలనా లేక భ్రాంతినా అనుకునేటప్పుడు అనుకున్న మాటలు.
రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్యా వాచా బ్రువతీ తమేవ |
తస్యానురూపం చ కథాం తదర్థా మేవం ప్రపశ్యామి తథా శృణోమి ||
నేను ఆ రాముని గురించి మాత్రమే మనస్సుతో ఆలోచిస్తూ, ఎప్పుడూ 'రామా! రామా!' అని జపించడంవల్ల, అతని ఆలోచనకు అనుగుణంగా నేను ఒక కథను చూస్తున్నాను మరియు వింటున్నాను.
---
కాబట్టి శ్రిరామ నామ జప ఔన్నత్యాన్ని గురించి మొదటగా చెప్పినవారు వాల్మీకి మహర్షి.

No comments:
Post a Comment