Monday, 31 August 2015

శ్రీరాముడు వాలి వయస్సులు ఒక్కటేనా?

శ్రీమద్రామాయణము బాలకాండ 15-17వ సర్గలలో వివరించిన విషయాల ప్రకారం, దశరథుదు పుత్త్రకామేష్టి యాగము చేస్తుండగా,:


  1. దేవతలందరు బ్రహ్మను, విష్ణువును రావణుని అంతం చేయమని వేడుకుంటారు. 
  2. విష్ణువు రావణుని అంతం చేయడానికి పుత్త్రకామేష్టి యాగం చేస్తున్న దశరథుని కుమారునిగా జన్మిస్తానని చెబుతాడు. 
  3. తన అంశతో భల్లూక రూపంలో జాంబవంతుడు ఇదివరకే అవతరించాడని, రామావతారం ఎత్తబోతున్న విష్ణువుకు సహాయపడడానికి దేవతలనందరిని వానర రూపాలలో అవతరించమని బ్రహ్మ ఆదేశిస్తాడు.  


ససత్య సంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణ: |
విష్ణో: సహాయాన్ బలిన: సృజధ్వం కామ రూపిణ: ||    (బాలకాండ 17వ సర్గ 2వ శ్లోకము)

"ఓ దేవతలారా!  సత్యసంధుడు, మహావీరుడు, మన అందఱికిని హితాభిలాషియు ఐన విష్ణువునకు కామరూపులును, బలశాలురును ఐన సహాయకులను సృజింపుడు".

దేవతల అంశలతో వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరులు జన్మిస్తారు.

వానరేంద్రం మహెంద్ర ఆభం ఇంద్రో వాలినం ఆత్మజం |
సుగ్రీవం జనయామాస తపన: తపతాం వర: ||   (బాలకాండ 17వ సర్గ 10వ శ్లోకము)

"ఇంద్రుడు మహేంద్ర పర్వతమువలె మిక్కిలి దృఢమైన దేహముగలవాడును, వానరశ్రేష్ఠుడును ఐన వాలికి జన్మనిచ్చెను.  తపింపజేయువారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవునికి జన్మనిచ్చెను."

దశరథుదు పుత్త్రకామేష్టి యాగము చేసిన సంవత్సరం తరువాత శ్రీరాముడు జన్మించినట్లు శ్రీమద్రామాయణం బాలకాండ 18వ సర్గలో ఉంది.   కాబట్టి శ్రీరాముడు, వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు ఇంచుమించుగా ఒకే వయస్సు కలిగిఉండాలి.

---------------------

ఐతే  శ్రీమద్రామాయణంలో ఇతర సర్గలలో వాల్మీకి మహర్షి ఇచ్చిన వివరణలతో వారి ప్రవర్తన, వయస్సులు పొసగడంలేదు.

1)    విష్ణువునకు కామరూపులును, బలశాలురును ఐన సహాయకులను సృజింపుడు అని పితామహుడైన బ్రహ్మ చెప్పగా దేవతలు వానరులను సృజించినపుడు, వాలి శ్రీరామునికి సహాయపడి ఉండాలి కదా!  రావణుడు సీతను అపహరించినపుడు శ్రీరామునికి ఏవిధమైన సహాయం కూడా వాలి చేయలేదు.  పైగా శ్రీరాముని చేతిలో మరణించాడు.

2)    పంప సరస్సు వద్ద మాతంగ ముని తపస్సు చేసుకుంటున్న సమయంలో, వాలికి దుంధుభి అనే దానవుడికి మధ్య జరిగిన యుద్ధంలో  వాలి ఆ దానవుని చంపి అతని మృతదేహాన్ని విసరివేసినపుడు, ఆ దేహం నుండి కారిన రక్తం,  మాతంగ ముని  ఆశ్రమంపై పడుతుంది.

అంటే ఈ సంఘటన జరిగిన సమయానికి వాలి కనీసం 20 సంవత్సరాలున్న యువకుడై ఉండాలి.

3)   మాతంగ ముని అక్కడే తపస్సు చేసుకుని వృద్ధుడై దేహం చాలించిన తరువాత, ఆయన శిష్యులు అదే ఆశ్రమంలో ఉంటు  తపస్సు చేసుకునేవారు.  వారికి సేవలు చేసుకుంటు, శబరి అనే స్త్రీ అక్కడే ఉండేది.

4)   మాతంగ ముని శిష్యులు అదే ఆశ్రమంలో ఉంటు  తపస్సు చేసుకుని వృద్ధులై దేహం చాలించిన సమయానికి,  25 సంవత్సరాల వయస్సులో ఉన్న శ్రీరాముడు, అరణ్యవాసం కోసం చిత్రకూటం చేరినట్లు శబరి శ్రీరామునితో అంటుంది.

చిత్రకూటం త్వయి ప్రాప్తే విమానై: అతుల ప్రభై: |
ఇత: తే దివం ఆరూఢా యానహం పర్యచారిషం ||   (అరణ్యకాండ 74వ సర్గ 14వ శ్లోకము)

"ఓ రామా! నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్యకాంతులతో విరాజిల్లెడి విమానములపై పరమపదమునకు చేరిరి."

5)    మాతంగ ముని పరమపదం చెందడం, ఆ తరువాత ఆయన శిష్యులు అక్కడే తపస్సు చేసుకుని వారు కూడా వృద్ధులై, పరమపదం చెందడానికి, వాలి దుంధుభి మధ్య జరిగిన యుద్ధానికి మధ్యలో కనీసం 40-50 సంవత్సరాలు గడచి ఉండాలి.  అంటే  వాలి ఆనాటికి కనీసం 60-70 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

6)    శ్రీరాముడు 13 సంవత్సరాల తరువాత కిష్కిందకు చేరే సమయానికి, శ్రీరాముని వయస్సు 38 సంవత్సరాలుకాగ, వాలి కనీసం 73-83 ఏళ్ళవాడై ఉండాలి.

7)    పైగా ఆనాటికే వాలికి  ఎదిగిన అంగదుడనే కుమారుడున్నాడు.

కాబట్టి శ్రీమద్రామాయణము బాలకాండలోని 15-17వ సర్గలు ప్రక్షిప్తమై ఉండాలి.







No comments:

Post a Comment