Saturday, 29 August 2015

శ్రీమద్రామాయణం ఎవరి కోసం?(భాగం - 3)

జనక మహారాజుతో పోలిస్తే శ్రీరాముని కథ కొన్ని ముఖ్యమైన అంశాలలో తప్ప వేరుగా ఉంది. 

శ్రీమద్రామాయణం ప్రకారం ఇద్దరు ధర్మబద్ధులే, తన కన్నా చిన్నవారిని, బలహీనులను ఆదరించారు, ఏక పత్నీవ్రతులే. వారి ధర్మనిరతికి మెచ్చి దేవతలు కూడా సహాయం చేసారు.  ఋషుల మన్ననలు పొందారు.

పైన చెప్పిన అంశాలు తప్ప జనక మహారాజు గురించి ఇంకేమి శ్రీమద్రామాయణం ద్వారా తెలియడం లేదు.
ఇక శ్రీరాముని విషయానికొస్తే, ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ఆయన జీవితంలో ఎదురుపడినన్ని సంఘటనలు, మలుపులు, ఆయనకు తటస్థపడినంతమంది ఋషులు, అనేకరకాల మనస్తత్వాలుకల మనుష్యులు, వానరులు, రాక్షసులు బహుశ: మరెవ్వరికి ఎదురుపడలేదేమో?

బ్రహ్మర్షి విశ్వామిత్రుని నుండి అతి దుర్లభమైన బల, అతిబల విద్యలు పొందినా, ఎంతో తపస్సుతోకాని దొరకని బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు పొందినా, చిన్నతనంలోనే భరద్వాజ, అగస్త్యుల వంటి గొప్పఋషుల అనుగ్రహం పొందినా, త్రిలోకాధిపతియైన ఇంద్రుడి అనుగ్రహం పొందినా నరుడైన శ్రీరామునికే చెల్లింది.
-------------

ముందుగా అనుకున్నట్లు ఒక వ్యక్తి త్రికరణశుద్ధిగా ధర్మబద్ధమైన జీవితం సాగిస్తున్నాడా లేక అతనిలో నిద్రాణంగా కొన్ని బలహీనతలు ఉన్నాయా అనేది చూడాలంటే ఆ వ్యక్తి వేరు వేరు సందర్భాలలో ముఖ్యంగా కష్టాలలో, ఎవరు కూడా గమనించలేని పరిస్థితులలో,లేదా చాల శక్తి ఉండి కూడా ఎవరికి అపకారం చేయకుండా ఉండి త్రికరణశుద్ధిగా ధర్మబద్ధమైన జీవితం సాగిస్తున్నాడా అనేది తెలియాలి!

శ్రీరాముడు  ధశరధుడు యువరాజ్య పట్టాభిషేకము తలపెట్టే వరకు, అంటే దాదాపు 27-28 సంవత్సరాల వరకు, భోగాల మధ్యన ప్రశాంతమైన జీవితమే గడిపాడు.

అసలైన పరీక్ష ఆ తరువాతనే మొదలైంది.

కైక కోరిన వరం ప్రకారం శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మమును ధరించి, జటాధారియై, దండకారణ్యమునకు వెళ్ళి, తాపసవృత్తిలో 14 సంవత్సరాలు  గడపాలి.

కోసల రాజ్యం సరిహద్దులో ఉన్న గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరపురము చేరిన తరువాత శ్రీరాముడు తాపసులు పాటించునట్టి భూశయనము, ఫలమూలములను ఆహారముగా గొనుట, మొదలైన నియమములను స్వీకరించి, ముందుగా గుహుని ద్వారా మఱ్ఱిపాలను తెప్పించుకుని, తల పైన కేశములపై పట్టించి జటాధారియైనాడు.

ఆ సమయం నుంచి, అరణ్యవాస కాలంలోను,తిరిగి అయోధ్యకు చేరే వరకు శ్రీరాముడు తాపసుల నియమాలను పాటించాడు.

దట్టమైన దండకారణ్యములో తనకు తెలిసినవారెవ్వరు లేరు. గమనించేవారెవ్వరు లేరు.

తాపసుల ధర్మం పాటించదలచినప్పుడు తనను ఎవరు గమనించినా, గమనించకపోయినా త్రికరణశుద్ధితో శ్రీరాముడు ఈ నియమాలు పాటించాడు.

No comments:

Post a Comment