1) కోసల రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న ఇక్ష్వాకువంశ రాజు దశరథ మహారాజు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 ప్రధాన భార్యలు, 350మంది ఇతర భార్యలు ఉండేవారు. దురదృష్టవశత్తు ఆయనకు పుత్ర సంతానము కలుగలేదు.
పుత్ర సంతానము కొఱకు పరితపిస్తున్న దశరథ మహారాజుకు సంతాన ప్రాప్తికై "అశ్వమేథయాగము" చేయవలెనని ఆలోచన కలిగి, వశిష్ఠ, వామదేవాది పురోహితులను పిలిపించి, తన ఆలోచన వారికి తెలుపుతాడు.
తదర్థం హయమేధేన యక్ష్యామి ఇతి మతిర్ మమ || (బాలకాండ 8వ సర్గ 8వ శ్లోకము)
"పుత్రులు లేనందున తపనపడుచున్న నాకు మన:శాంతి కఱవైనది. అందులకై అశ్వమేధయజ్ఞము చేయవలయునని నా సంకల్పము".
వశిష్ఠ, వామదేవాది పురోహితులందరు దశరథుని సూచనకు ఆమోదము తెలుపుతారు.
2) ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సరయునదికి ఉత్తరంలో యజ్ఞభూమిని సిద్ధం చేయించి అక్కడ అశ్వమేధ యజ్ఞము నిర్వహిస్తాడు. ఆ యజ్ఞ సమాప్తి తరువాత అందరికి దానాలు చేసి నమస్కరిస్తాడు.
2) ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సరయునదికి ఉత్తరంలో యజ్ఞభూమిని సిద్ధం చేయించి అక్కడ అశ్వమేధ యజ్ఞము నిర్వహిస్తాడు. ఆ యజ్ఞ సమాప్తి తరువాత అందరికి దానాలు చేసి నమస్కరిస్తాడు.
తత: ప్రీత మనా రాజా ప్రాప్య యజ్ఞం అనుత్తమం ||
పాప అపహం స్వర్నయనం దుష్కరం పార్థివర్షభై: | (బాలకాండ 14వ సర్గ 55వ శ్లోకము)
"పుత్త్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు, పుత్త్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు ఐన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి, దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయెను."
3) పుత్త్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునది ఐన అశ్వమేధ యజ్ఞమును దశరథుడు ఆచరించాడు అని బాలకాండ 14వ సర్గలో చెప్పిన తరువాత, మరి దేనికోసం 15-17వ సర్గలలో పుత్రకామేష్టి యాగము నిర్వహించినట్లు చెప్పబడింది?
4) దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ క్రతువు ముగిసినది అని 18వ సర్గ ప్రారంభ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పాడు. కానీ పుత్రకామేష్టి యాగము ముగిసినది అని వాల్మీకి మహర్షి చెప్పలేదు.
నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మన: |
ప్రతి గృహ్య సురా భాగాన్ ప్రతిజగ్ము: యథా ఆగతం || (బాలకాండ 18వ సర్గ 1వ శ్లోకము)
"మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ క్రతువు ముగిసినది. దేవతలు అందఱును తమ తమ హవిర్భాగములను స్వీకరించి, స్వస్థానములకు చేరిరి."
5) బాలకాండ 15-17వ సర్గలలో వివరించిన విషయాలను గమనిస్తే ఈ పుత్రకామేష్టి యాగము రహస్యం అర్థమవుతుంది.
5) బాలకాండ 15-17వ సర్గలలో వివరించిన విషయాలను గమనిస్తే ఈ పుత్రకామేష్టి యాగము రహస్యం అర్థమవుతుంది.
ఈ సర్గలలో
వివరించిన విషయాలు:
- · దేవతలందరు బ్రహ్మను, విష్ణువును రావణుని అంతం చేయమని వేడుకుంటారు.
- · విష్ణువు రావణుని అంతం చేయడానికి పుత్త్రకామేష్టి యాగం చేస్తున్న దశరథుని కుమారునిగా జన్మిస్తానని చెబుతాడు.
- · తన అంశతో భల్లూక రూపంలో జాంబవంతుడు అవతరించాడని, రామావతారం ఎత్తబోతున్న విష్ణువుకు సహాయపడడానికి దేవతలనందరిని వానర రూపాలలో అవతరించమని బ్రహ్మ ఆదేశిస్తాడు. దేవతల అంశలతో వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరులు జన్మిస్తారు.
6) ఇక్కడ గమనించవలసిన విషయాలు:
(i) శ్రీమద్రామాయణంలో వేదకాల దేవతలను మాత్రం వాల్మీకి మహర్షి కీర్తించారు. అందులో విష్ణువు ఇంద్రుడి తమ్ముడు (ఇంద్రానుజం) మాత్రమే! దేవతలలో విష్ణువు స్థానం ఇంద్రుడి తరువాతనే! అందుకే శ్రీమద్రామాయణంలో అనేకచోట్ల శ్రీరాముని ఇంద్రుడితో, లక్ష్మణుని విష్ణువుతో పోలుస్తూ కనిపిస్తుంది.
(ii) మరి బాలకాండ 15-17వ సర్గలలో విష్ణువు రావణుని అంతం చేయడానికి పుత్త్రకామేష్టి యాగం చేస్తున్న దశరథుని కుమారునిగా జన్మిస్తానని ఎలా చెప్పినట్లు?
(iii) ఇందంతా వైష్ణవులు విష్ణువు ఆధిక్యాన్ని నిరూపించడానికి ఆనాటి మహాపురుషులందరిని విష్ణువవతారంగా కీర్తిస్తూ వ్రాయించిన కథలే! మత్స్య,వరాహ, అవతారములు ఎత్తినది పితామహుడైన బ్రహ్మ. ఐతే ఇవన్నీ విష్ణువుకు ఆపాదించి పురాణాలు వ్రాసారు.
అలాగే మహాపురుషుడైన శ్రీరాముని విష్ణువవతారంగా కీర్తిస్తూ బాలకాండ 15-17వ సర్గలు వ్రాయబడ్డాయి! ఈ సర్గలు ప్రక్షిప్తాలే!
No comments:
Post a Comment