స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకము (పేజి 200) నుండి గ్రహించిన విషయము.
విష్ణువు వామనుడుగా పుట్టుట, క్షీరసాగరమథనవేళ కూర్మరూపము ధరించుట అనునవి రామాయణమున పేర్కొనబడినవి. అందులో వామన ఘట్టము, మామూలుగా భారత భాగవత పురాణములందున్నట్లు లేదు.
దేవతలు రాక్షసుల బాధలు భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకొని, బ్రహ్మ పురస్సరులై విష్ణుదేవుని ప్రార్థించి ఆయనచే అభయమునొందుట భారత పౌరాణిక పద్ధతి. అందు విష్ణువు దేవతలకంటె అధికుడు.
కాని రామాయణమున వామన కథ అట్లు లేదు. అది వేదపద్ధతి ప్రకారమున్నది. వేదమున విష్ణువు అధికుడు కాదు. దేవతలు విష్ణువును తరచుగా దేవకార్యమునకు నియోగించుచుందురు. ఆయన అట్టి కార్యమును దేవ నియోగము చొప్పున చేయుచుండువాడు. వైదిక దేవతలు అగ్ని పురస్సరులు. కాని పౌరాణిక దేవతలు బ్రహ్మ పురస్సరులు. రామాయణమున చూడుడు.
-----
బలిచే ఇంద్రుడు, దేవతలు నిర్జింపబడిన తర్వాత బలి యాగము చేయుచుండగా అగ్ని పురస్సరులై దేవతలు విష్ణువు తపస్సు చేయుచున్న సిద్ధాశ్రమమునకు వచ్చిరి.
బలేస్తు యజమానస్య దేవా స్సాగ్ని పురోగమా:
సమాగమ్యస్వయం చైవ విష్ణుం ఊచు: ఇహ ఆశ్రమే
(బాలకాండ 29 సర్గ 6 శ్లోకం)
బ్రహ్మ పురస్సరులైన దేవతలుగారు వీరు! వీరు అగ్ని పురస్సరులు. "స్వయం సమాగమ్య" అనుటచే ఎప్పుడును కదలని వారు వారే స్వయముగా విష్ణువు దగ్గరకు వచ్చిరి అని అర్థము.
అనగా విష్ణువు కంటె దేవతలే అధికులు.విష్ణువును తమ వద్దలు పిలిపించుకొని కార్యము చెప్పువారు. "ఊచు:" అనుట విష్ణువును ప్రార్థించుటగాదు. ఈ శ్లోకము వేదమందలి పరిస్థితిని బట్టి వాయబడినది. కనుక అతి ప్రాచీనము.
దేవతలు విష్ణువుకు ఇట్లు చెప్పిరి:
సత్వం సురహితార్థాయ మాయాయోగ ముపాగత:
వామనత్వం గతో విష్ణో కురు కళ్యాణముత్తమం
(బాలకాండ 29 సర్గ 9 శ్లోకం)
"దేవహితార్థమై మాయాయోగము చేత వామనుడవై కళ్యాణ మొనరింపుము" అని దేవతలు విష్ణువును ఆజ్ఞాపించుచున్నారు.
మరొక ముఖ్యమైనది - వామనత్వము విష్ణువు మాయాయోగము చేత పొందవలెనట! అది కూడా దేవతలే నిర్దేశించిరి. ఈ కారణము చేత మూలగాథ ఇంతే ఉండగా అదితికి కశ్యపునకు వామనుడు పుట్టుట అనునది తర్వాత చేర్చబడినది కావలెను.
No comments:
Post a Comment