Thursday, 3 September 2015

ఇంద్రుడిమీద విష్ణు, శివ ఆధిక్యం ఎప్పటినుండి ప్రారంభమయ్యింది? - భాగం-1

వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము.  ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది.

మహాభారత కథలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి పరిశీలిస్తే, మహర్షి వ్యాసుడు, మహర్షి వాల్మీకి అనుసరించిన వేద సంప్రదాయాలనే అనుసరిస్తూ, లోకహితం ఆశించి మహాభారత కథను ప్రపంచానికి అందించినట్లు అర్థమవుతుంది.

మహర్షి వ్యాసుడు మహాభారత కథను "జయం" అనే పేరుతో ప్రపంచానికి అందించినప్పటి సమయానికి అందులో 8,800 శ్లోకాలు మాత్రమే ఉన్నట్లు, తరువాత అది వైశంపాయనుడు పరిక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి చెప్పేసమయానికి 22,000 శ్లోకాలతో విస్తరించబడినట్లు, తరువాత సూతుడు చెప్పడం, ఋషులు వినడం అయిన పౌరాణిక సాంప్రదాయాలతో విస్తరించబడిన "మహాభారతం" 1,00,000 శ్లోకాల విశాల గ్రంథమైనట్లు మహాభారత ప్రారంభ అథ్యాయాలలోనే ఉంది.

శ్రీమద్రామాయణంలో అక్కడక్కడ, మహాభారతంలో విస్తృతంగాను ఉన్న దేవధిదేవతలుగా విష్ణు, శివ కీర్తన నిజానికి,  మహర్షి వ్యాసుడు మహాభారత కథను "జయం" అనే పేరుతో ప్రపంచానికి అందించినప్పటి సమయానికి (8,800 శ్లోకాల "జయం" కథలో) లేదనే అనుకోవాలి.

ఎందుకంటే కలియుగ ప్రారంభానికి రమారమి 36 సంవత్సరాలకు ముందు జరిగిన మహాభారతయుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన  శ్రీమద్భగవద్గీతలోని క్రింది శ్లోకములను గమనిస్తే, శ్రీమద్భగవద్గీతలో కూడా వేదకాలంనాటి దేవతల ప్రస్తుతే కనబడుతుంది.

------------------

అన్ని వర్గాలలో/తెగలలో అధికుని నేనే అని శ్రీమద్భగవద్గీత, విభూతి యోగములో శ్రీకృష్ణుడు  అన్నాడు.

ఆదిత్యానామహం విష్ణు: జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ||     (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము  21వ శ్లోకము)

"(అదితియొక్క ద్వాదశ పుత్రులైన)  ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను.  మరుత్తగణములలో మరీచినే నేను. నక్షత్రములలో చంద్రుడను నేను".

*ద్వాదశ ఆదిత్యులు:

(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ,అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణు.)

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం|
వసూనాం పావకశ్చాస్మి మేరు: శిఖరిణామహం||  (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము  23వ శ్లోకము)

"ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను.  యక్షరాక్షసులలో ధనాధిపతియైన  కుబేరుడను నేను.  అష్టవసువులలో అగ్నిని నేను.  పర్వతములలో "మేరు" పర్వతమును నేను."

--------------

ఆదిత్యులలో (అధికుడైన) విష్ణువును  నేను అని మాత్రమే శ్రీకృష్ణుడు అంటున్నాడు. దేవధిపతి అనడంలేదు.  ఏకాదశ రుద్రులలో శంకరుడిని నేను అంటున్నాడు, దేవధిపతి అనడంలేదు.  శ్రీమద్భగవద్గీతలో  శ్రీగణపతి, శ్రీ రాజరాజేశ్వరి ప్రస్తావన కనిపించదు. 

ఐతే దేవతల అధిపతిగా ఇంద్రుని ప్రస్తావన ఉంది.

వేదానాం సామవేదోऽస్మి దేవానామస్మి వాసవ: |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||  (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము  22వ శ్లోకము)


"వేదములలో నేను సామవేదమును.  దేవతలలో ఇంద్రుడను నేను.  ఇంద్రియములలో నేను మనస్సును.  ప్రాణులలో చైతన్యమును నేను."

----------------

పురాణాలలో అత్యంత శక్తిమంతంగా విస్తృతంగా కీర్తించబడిన విష్ణు, శివుల ఆయుధాలైన "సుదర్శన చక్రం", "త్రిశూలం" గురించి శ్రీమద్భగవద్గీతలో ప్రస్తావనే లేదు.

ఆయుధాలలో అత్యంత శక్తిమంతంగా ఇంద్రుని ఆయుధమైన "వజ్రం" శ్రీమద్భగవద్గీత, విభూతి యోగములో కీర్తించబడినది.

ఆయుధానామహం వజ్రం  ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కందర్ప:  సర్పాణామస్మి వాసుకి:||  (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము  28వ శ్లోకము)

"ఆయుధములలో వజ్రాయుధమును నేను.  పాడి ఆవులలో కామధేనువును నేను.  సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను.  సర్పములలో వాసుకిని నేను."

------------------

వెరసి అర్థమయ్యేదేమిటంటే, శ్రీమద్రామాయణం, మహాభారతం వ్రాసేనాటికి విష్ణు, శివ ఆధిక్యం లేదు.  దేవతలకు అధిపతి ఇంద్రుడు మాత్రమే!

No comments:

Post a Comment