సుందరకాండలో శ్రీహనుమ 80 వేలమంది కింకరులను, జంబుమాలిని, వీరులైన 7 మంది అమాత్యపుత్రులను, 5 మంది సేనానాయకులను, అసంఖ్యాకముగానున్న ఆశ్వములను, గజములను, పదాతిదళములను సంహరించాడు.
ఐతే శ్రీహనుమ వధించిన అసంఖ్యాకముగానున్న పదాతిదళ రాక్షసుల సంఖ్య ఎంత?
దీనికి మహర్షి వాల్మీకి శ్రీమద్రామాయణములో ఎక్కడా నేరుగా సమాధానము చెప్పలేదు. వేరు వేరు సందర్భాలలో రాక్షసుల వర్ణన, శ్రీహనుమ శ్రీరామునికి ఇచ్చిన తన లంకాయాన గాథ వివరణలను కలిపి ఆలోచిస్తే, దీనికి పరోక్ష సమాథానం దొరుకుతుంది.
------
రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చి, తన లంకావైభవాన్ని, తన సామర్థ్యాన్ని, తన సేనలను గురించి వివరిస్తూ ఇలా అంటాడు.
దశ రాక్షసకోట్యశ్చ ద్వావింశతిరథాపరా:|
తేషాం ప్రభురహం సీతే! సర్వేషాం భీమకర్మణాం||
(అరణ్యకాండ 55వ సర్గ 14వ శ్లోకము)
"ఓ సీతా! నా ఆధీనములో 32 కోట్లమంది రాక్షసయోధులు గలరు. భయంకర కృత్యములను ఒనర్చుటలో వీరు సమర్థులు."
-------
శ్రీహనుమ శ్రీరామునికి తన లంకాయాన గాథను వివరిస్తూ, లంకా నగర రక్షణ వ్యవస్థను గురించి తెలిపి, తాను ఎలా ఆ నగరాన్ని ధ్వంసం చేసాడో చెబుతూ ఇలా అంటాడు.
తే మయా సంక్రమా భగ్నా: పరిఖా: చ అవపూరితా:|
దగ్ధా చ నగరీ లంకా ప్రాకారా: చ అవసాదితా:||
బల ఏక దేశ: క్షపితో రాక్షసానాం మహాత్మనాం| (యుద్ధకాండ 3వ సర్గ 29-30వ శ్లోకములు)
"నేను అచటి వంతెనలన్నింటిని భగ్నము చేసితిని. అగడ్తలను రాళ్ళతో నింపివేసితిని. లంకానగరమును దగ్ధమొనర్చితిని. ప్రాకారములను నేలమట్టమొనర్చితిని. ధృఢకాయులైన రాక్షసయోధుల యొక్క సైన్యములో ఒక భాగమును నాశనమొనర్చితిని."
-------------
రావణుడు తన ఆధీనములో 32 కోట్లమంది రాక్షసయోధులు ఉన్నట్లు చెప్పినదాన్ని ఆధారంగా చేసుకుంటే, శ్రీహనుమ 32 కోట్లమంది రాక్షసయోధులలో ఒక భాగాన్ని నాశనం చేసినట్లు అర్థం చేసుకోవచ్చును.
ఐతే ఒక భాగం అంటే, (1) 32 కోట్లను 100 భాగాలు చేసి అందులో ఒక భాగం అనుకోవచ్చును
(లేదా)
(2) 4 భాగాలు చేసి అందులో ఒక భాగం అనుకోవచ్చును.
(శ్రీ గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారు ఈ విధానాన్ని అనుసరించి శ్రీహనుమ 4వ భాగాన్ని నాశనం చేసినట్లు అనువాదం చేసారు).
(I) 32 కోట్లను 100 భాగాలు చేసి అందులో ఒక భాగం అనుకుంటే 32 లక్షల రాక్షసయోధులను శ్రీహనుమ నాశనం చేసినట్లు అర్థం చేసుకోవచ్చును.
(II) 32 కోట్లను 4 భాగాలు చేసి అందులో ఒక భాగం అనుకుంటే 8 కోట్ల రాక్షసయోధులను శ్రీహనుమ నాశనం చేసినట్లు అర్థం చేసుకోవచ్చును.
No comments:
Post a Comment