శ్రీహనుమ సీతతో మాట్లాడి, ఆమెను ఓదార్చి, ఆమె ఇచ్చిన చూడామణి తీసుకుని శ్రీరామునివద్దకు వెళ్ళడానికి బయలుదేరి, సీత పడిన వేదన గుర్తుకు వచ్చి, రాక్షసులతో యుద్ధం చేయదలచి, సీత కూర్చున్న శింశుపా వృక్షం మినహాయించి, అశోకవనంలో మిగిలిన వృక్షాలను పడద్రోసి, యుద్ధానికి ఎదురుచూస్తున్న సమయంలో, రాక్షస స్త్రీలు నిద్ర లేచి, శ్రీహనుమను గమనిస్తారు.
శ్రీహనుమ రాక్షస స్త్రీలకు భయం కలుగునట్లుగా తన శరీరాన్ని పెంచుతాడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు సీతను ఆ భయంకర వానరుడు ఎవరని, అతనితో అమె ఏమి మాట్లాడినదో తెలుపమని అడుగుతారు.
అప్పుడు సీత ఇలా అంటుంది.
అథ అబ్రవీత్ తదా సాధ్వీ సీతా సర్వాంగసుందరీ |
రక్షసాం కామ రూపాణాం విజ్ఞానే మమ కా గతి: || (సుందరకాండ 42వ సర్గ 8వ శ్లోకము)
సర్వాంగసుందరియు, సాధ్వియు ఐన సీత ఇట్లు పలికెను "కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియును?"
యూయం ఏవ అభిజానీత యో అయం యద్వా కరిష్యతి |
అహిరేవ అహే: పాదాన్ విజానాతి న సంశయ: || (సుందరకాండ 42వ సర్గ 9వ శ్లోకము)
"ఇతడెవరో? ఏమి చేయనున్నాడో? మీకే తెలియును. పాము జాడలు పామునకే యెఱుక. ఇది లోక విదితము".
అహం అపి అస్య భీతా అస్మి న ఏనం జానామి కొ అన్వయం |
వేద్మి రాక్షసం ఏవ ఏనం కామ రూపిణం ఆగతం || (సుందరకాండ 42వ సర్గ 10వ శ్లోకము)
"ఇతనిని జూచి నేనును భయపడుచున్నాను. ఇతడు ఎవరో నేనెఱుగను. కామరూపియైన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును."
సీత ఇలా అబద్ధం ఎందుకు చెప్పింది?
రాక్షస స్త్రీలంటే భయపడి అలా అని ఉండవచ్చునా? రాజ్యం వదలి శ్రీరామునితో అరణ్యానికి వచ్చినప్పటి పరిస్థితులలోగానీ, తనను భయపెట్టే రావణునికిగానీ, రాక్షస స్త్రీలు పెట్టే బాధలు తట్టులేకపోయిన స్థితిలోగానీ, సీతకు శ్రీరాముని పట్లనున్న నమ్మకం సడలలేదు, తన దీక్షను వదలలేదు.
అటువంటి సీత ఇలా అబద్ధం ఎందుకు చెప్పింది? చిత్రమే!
No comments:
Post a Comment