Thursday, 3 September 2015

శ్రీ ఆదిశంకరుడి కార్యం పూర్తి ఐనదా?


మన తెలుగువాడైన కీ.శే. శ్రీ కోట వేంకటాచలం, మరికొంతమంది స్వదేశి చరిత్రకారుల పరిశోధన  ప్రకారం,  మహాభారతయుద్ధం క్రీ.పూ. 3139 వ సంవత్సరంలో జరిగినది.  కలిశకం క్రీ.పూ. 3102 వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది.


క్రీ.పూ. 3102వ సంవత్సరంలో  కలియుగం ప్రారంభంనాటికి ఉన్న వేదకాలంనాటి దేవతల ఆరాధన, క్రీ.పూ.509వ సంవత్సరంలో జన్మించిన శ్రీ ఆదిశంకరుల కాలం నాటికి (2,600 సంవత్సరాల కాల పరిధిలో) తొలగిపోయి, విష్ణు, శివ, శక్తి, గణపతి ఆరాధన ఆధిపత్యంలోకి వచ్చింది.  వేదకాలంనాటి దేవతలైన సూర్య, కార్తికేయుల ఆరాధన మాత్రం కొనసాగింది.



మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం శ్రీ ఆదిశంకరులు, అప్పటికే మనదేశంలో ఉన్న అనేక సాంప్రదాయాలను సమన్వయపరచి, ఆయన కాలానికి ఆధిపత్యంలోకి వచ్చిన విష్ణు, శివ, శక్తి, గణపతి ఆరాధనలను, వేదకాలంనాటినుంచి కొనసాగిన సూర్య, కార్తికేయుల ఆరాధనలను కలిపి, ఆరు మతాలను స్థిరీకరించి, పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించి,  బౌద్ధమతాన్ని దేశంనుంచి తరిమివేసినట్లుగా,  ఆయన 32వ సంవత్సరంలో సమాధి చెందినట్లుగా చెబుతారు. 



అనేక ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు బాష్యం వ్రాయడం వంటి కార్యాలు, బౌద్ధమతాన్ని దేశంనుంచి తరిమివేయడం మాత్రమే ఆయన జీవితలక్ష్యాలా అని ఆలోచిస్తే,   ఆయన స్థాయి వ్యక్తి మాత్రమే చేయగలిగినది, భగవంతుడు కొద్దిపాటి ఆయువు మాత్రమే ఆయనకు ఇవ్వడంవల్ల,  ఆయన చేయలేకపోయిన ఇంకొక కార్యం నాకు స్ఫురిస్తోంది.  

 ఈ ఊహకు ఆధారమేమి లేదు.  కేవలం నాకు స్ఫురించిన విషయం మాత్రమే!


శ్రీ ఆదిశంకరుల జీవిత చరిత్ర చాలా సంక్షిప్తంగా దొరుకుతోంది.  ఆయన అద్వైతి.  అద్వైతై ఉండి ఆయన "సౌందర్యలహరి (అమ్మవారి స్తోత్రం)", "శివానందలహరి (శివుని స్తోత్రం)", "భజగోవిందం (విష్ణువు స్తోత్రం)" వంటివి వ్రాసారంటే ఆశ్చర్యమే కలుగుతుంది. అలాగే విష్ణు, శివ, శక్తి, గణపతి ఆరాధనలను, వేదకాలంనాటినుంచి కొనసాగిన సూర్య, కార్తికేయుల ఆరాధనలను కలిపి, ఆరు మతాలను స్థిరీకరించి, పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించినట్లుగా ఉన్న కథలు నమ్మదగినవిగా అనిపించలేదు.

ఆయన కాలానికి వేదాలలో, శ్రీమద్రామాయణ, మహాభారత ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో,  అనేక ప్రక్షిప్తాల కారణంగా ఇప్పటిలో ఉన్నంత గందరగోళం ఉండిఉండదు.  పైగా ఆయన స్వయంగా పండితుడు. ఆపైన జ్ఞాని.  అన్నింటిని నిష్పక్షపాతంగా దర్శించగలిగే శక్తి ఉన్నవాడు.

బౌద్ధమతాన్ని దేశం నుంచి తరిమివేసిన తరువాత, శ్రీ ఆదిశంకరులు మరికొంత కాలం జీవించి ఉన్నట్లైతే,   వేదకాలంనాటి సనాతనధర్మ ఆరాధనా పద్ధతులని తిరిగి దేశంలో తప్పక నెలకొల్పిఉండేవారు. 


వేదకాలంలో యజ్ఞాలు చేయడం, అగ్నిద్వారా హవిస్సులు దేవతలకు ఇవ్వడం, విశ్వామిత్రుడులాంటి ఋషులు తపస్సు చేయడం, ప్రజలు ఋషులు బోధించిన ధర్మమార్గం అనుసరించడం తప్ప వేరేమి కనిపించవు.

ఐతే ఆనాటి రాజులు కానీ, ప్రజలుగానీ ఆనాటి దేవతలైన ఇంద్రుడు, వరుణుడు, వాయువు మొదలైన వారిలో ఏ ఒక్కరినో ఆశ్రయించి, ఆ దేవతనే కీర్తిస్తూ, మిగిలినవారిని కించపరుస్తూ మాత్రం జీవించలేదు.  మహాభారత కాలంవరకు ఉన్న వేదకాలంలో విగ్రహారాధన కనిపించదు.  

పరాయి దేశాలనుంచి మనదేశానికి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలతోపాటు, శైవం, వైష్ణవం వంటి మతాలు ప్రధానంగా ప్రోత్సహించేది, వేదకాలంలో లేనటువంటి గుంపు మనస్తత్వం.

అందరికన్నా బలమైన కాలప్రభావంవల్ల ఆయన శరీరం వదిలిపోవలసి వచ్చిందిగానీ, ఎప్పటికి విగ్రహారాధనను, దానితోపాటు వచ్చే ఈ గుంపు మనస్తత్త్వాన్ని ఆయన వంటి జ్ఞాని ససేమిరా ప్రోత్సహించరు. 

No comments:

Post a Comment