Thursday, 3 September 2015

సీత శ్రీహనుమ ఎవరో తెలియదని రాక్షస స్త్రీలతో ఎందుకు అబద్ధమాడింది? - భాగం - 2


ఇంతకీ శ్రీహనుమ ఎవరో తెలియదని సీత అబద్ధమాడినదనుకోవాలా? (లేక) ఆ మాటలు వ్యంగ్యంగా అనిదని అనుకోవచ్చునా?
------------------------

ఒక ఉదాహరణ గమనిద్దాం!

ఒక వార్తకోసం ఎదురుచూస్తున్న ఎవరినైనా,  వార్త వచ్చిందా, వచ్చిందా అని ఇంకో వ్యక్తి అదేపనిగా అడుగుతూంటే, ఆ మొదటి వ్యక్తి ప్రారంభంలో "ఇంకా రాలేదు"అని అంటాడేమోకానీ, చివరకు చిరాకుకలిగి "వాడు కూడా నీలాంటి వాడే! అందుకే ఇంకా ఆ వ్యక్తి వార్త పంపలేదు! నీవు వాడికి చెప్పరాదా?" అనవచ్చును.

ఈ సందర్భంలో వార్తకోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి, అదేపనిగా అడుగుతున్న వ్యక్తి అంటే కోపం ఉన్నా లేకపోయినా, ఆ సమయంలో  అదేపనిగా అడగడం వల్ల (మంచి ఉద్దేశ్యంతోనే కావచ్చును),  "వాడు కూడా నీలాంటి వాడే!  నీవు వాడికి చెప్పరాదా?" అనవచ్చును.  ఇక్కడ అది వ్యంగ్యంగా అన్నట్లుగా భావించాలిగానీ, అదే ఉద్దేశ్యంతో అన్నట్లుగా తీసుకోరాదు.

-----------------------------
రాక్షస స్త్రీలు సీతను ఆ భయంకర వానరుడు ఎవరని, అతనితో అమె ఏమి మాట్లాడినదో తెలుపమని అడుగుతారు.  అంటే అర్థం, వారు నిద్రపోలేదని,  సీత శ్రీహనుమలు ఏమి మాట్లాడారో వారు వినలేదుగానీ, మాట్లాడుకున్నారని మాత్రము గమనించారు.

మరి అప్పుడే అడ్డుపడి గోల చేసిఉండవచ్చునుగానీ వారలా చేయలేదు.  కారణం?

పిల్లి ఆకార శరీర ప్రమాణంతో ఉన్న శ్రీహనుమ, సీతకు ధైర్యం కలిగించడానికి భీకరరూపం చూపించినపుడు రాక్షస స్త్రీలు కూడా గమనించి ఉండవచ్చును.  శ్రీహనుమ భీకరరూపం చూసి, భయపడి ఉండవచ్చును (లేదా) అంతకుముందే రాక్షసులకు అపాయాన్ని సూచించే  త్రిజట చెప్పిన కల వారి మదిలో మెదులుతూ ఉండిఉండవచ్చును.

సమాధానంగా సీత అన్నవన్నీ కలిపి ఆలోచిస్తే, ఆమె వ్యంగ్యంగా అన్నట్లుగా అర్థమవుతుంది తప్ప ఆమె అబద్ధమాడినదనుకోవసరం లేదు.

శ్రీహనుమ ఎవరో తెలియదని మాత్రమే సీత అనలేదు.  ఇంకా చాలా అంది.

  1.  "కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియును?"
  2.  "ఇతడెవరో? ఏమి చేయనున్నాడో? మీకే తెలియును. పాము జాడలు పామునకే యెఱుక.  ఇది లోక విదితము".
  3. "ఇతనిని జూచి నేనును భయపడుచున్నాను.  ఇతడు ఎవరో నేనెఱుగను.  కామరూపియైన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును."
శ్రీరాముని బల,పరాక్రమాలు సీతకు తెలుసును.  శ్రీరాముని ఎదిరించలేక, కపట బ్రాహ్మణ వేషంలో వచ్చి, తనను అపహరించాడని సీత రావణుని చాలాసార్లు నిందించింది.

శ్రీహనుమ కూడా మొదట పిల్లి ఆకార శరీర ప్రమాణంతో సీతను కలిసి మాట్లాడి తరువాత భీకర రూపం చూపించాడు.  కాబట్టి ఆయన కామరూపధారణ శక్తి సీతకు అర్థమయ్యింది.

అంతవరకు దీనంగా ఉండి, రాక్షస స్త్రీలు  మాటలతో చాలా బాధించడంవల్ల కలిగిన వేదనతో, దు:ఖంతో కూడిన సమాధానాలు ఇచ్చిన సీత,  శ్రీహనుమ కలిగించిన స్వాంతనవల్ల సీతకు ధైర్యం కలిగి, రాక్షస స్త్రీలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చినదనే అర్థం చేసుకోవాలిగానీ, అబద్ధం చెప్పిందనుకోరాదు.

No comments:

Post a Comment