వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము. ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది. మహాభారతము వ్రాసిన తరువాత వేదవ్యాసుడు 18 పురాణాలు వ్రాసినట్లు నానుడి.
శ్రీమద్రామాయణంలో గాయత్రి ప్రస్తావన తప్ప, మరియే ఇతర శక్తి రూపం ప్రస్తావన కనిపించదు. శ్రీమద్భగవద్గీతలో శ్రీ రాజరాజేశ్వరి ప్రస్తావన కనిపించదు. శాక్తేయ సాంప్రదాయంలో ఉన్న కథలన్నింటికి మూలం పురాణాలే.
ఐతే తాంత్రిక/వామాచార సాంప్రదాయం మాత్రం శ్రీమద్రామాయణం కాలంనాటికే ఉన్నట్లు శ్రీమద్రామాయణం ద్వారా తెలుస్తుంది.
-------------------
పంచ "మ" కారాలు (మద్యం, మాంసం, మైధునం, మత్స్యం, ముద్ర) అనుసరించే/పాటించే తాంత్రికులు చాలా కాలంనుండే మన దేశంలో ఉన్నారు. అప్పుడప్పుడు బలులు ఇవ్వడం కూడా జరుగవచ్చును.
తంత్ర విద్యలు అనుసరించే వారికి సులభంగా తాంత్రిక శక్తులు లభిస్తాయి. ఐతే ఆ శక్తులను దుర్వినియోగపరిస్తే, అంతం కూడా దాఋణంగానే ఉంటుంది.
రామాయణకాలంలో ఇటువంటి తంత్ర విద్యలను పాటించినవారున్నారనడానికి ఇంద్రజిత్తు కథయే ఒక ఉదాహరణ.
--------------------
1) కుంభకర్ణుడు, త్రిశిరుడు, దేవాంతకుడు మొదలైన వీరులు యుద్ధంలో మరణించిన తరువాత, రామలక్ష్మణుల అంతం చూస్తానని ఇంద్రజిత్తు బయలుదేరుతాడు. యుద్ధరంగంలో అదృశ్యుడయ్యేముందు ఒక తాంత్రిక హోమం చేసి ఒక మేకను బలి ఇచ్చినట్లు శ్రీమద్రామాయణం చెబుతోంది.
స తత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై: సతోమరై:|
చాగస్య కృష్ణవర్ణస్య గళం జగ్రాహ జీవత: || (యుద్ధకాండ 73వ సర్గ 22వ శ్లోకము)
"ఇంద్రజిత్తు యుద్ధభూమియందు అగ్ని చుట్టును దర్భలను, చిన్న ఈటెలను పఱచి, సజీవముగానున్న నల్లని మేకయొక్క కంఠమును పట్టుకుని, దానిని అగ్నికి ఆహుతిగా ఇచ్చెను."
సకృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిష: ||
బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయన్ | (యుద్ధకాండ 73వ సర్గ 25వ శ్లోకము)
"అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలించినవి. అందు విజయసూచకములైన చిహ్నములు గోచరించినవి."
2) మాయ సీతను చంపి, శ్రీరాముని, అతని సైన్యాన్ని దు:ఖంలో ముంచి, అజేయుడవడానికి ఒక తాంత్రిక యజ్ఞం చేయడానికి నికుంభిలకు వెళ్ళినట్లు శ్రీమద్రామాయణంలో విభీషణుడు చెబుతాడు. బలి ఇవ్వడం పూర్తి అవుతే ఇంద్రజిత్తు అజేయుడవుతాడు.
వానరాన్ మోహయిత్వా తు ప్రతియాత: స రాక్షస: |
మాయామయీం మహాబాహో! తాం విద్ధి జనకాత్మజాం| (యుద్ధకాండ 84వ సర్గ 13వ శ్లోకము)
"ఓ మహాబాహు! రామా! ఇంద్రజిత్తు వధించిన జానకిని మాయాసీతగా ఎఱుంగుము - ఆ విధముగా వానరులను భ్రమకు గుఱిచేసి ఆ రాక్షసుడు, తాను అభిచార హోమములను నిర్వహించుటకై తిరిగి నికుంభిళా చైత్యమునకు వెళ్ళెను."
చైత్యం నికుంభిళాం నామ యత్ర హోమం కరిష్యతి |
హుతవాన్ ఉపయాతో హి దేవైరపి సవాసవై: ||
దురాధర్షో భవత్యేవ సంగ్రామే రావణాత్మజ: | (యుద్ధకాండ 84వ సర్గ 14వ శ్లోకము)
"హోమకార్యములను ముగించుకొని అతడు మఱల యుద్ధరంగమున నిలిచినచో అప్పుడు అతనిని ఇంద్రాది దేవతలు సైతము జయించుట అసాధ్యము."
3) నికుంభిళా చైత్యములో అభిచార హోమములను నిర్వహించుట వలన వచ్చే శక్తులతోపాటు, దానికి విఘ్నం కలిగితే, జరిగే అనర్థాలను గురించి పితామహుడైన బ్రహ్మ హెచ్చరించినట్లు విభీషణుడు చెబుతాడు.
నికుంభిళాం అసంప్రాప్తం అహుతాగ్నిం చ యో రిపు: |
త్వామాతతాయినం హన్యాదింద్రశత్రో: స తే వధ: || (యుద్ధకాండ 85వ సర్గ 14వ శ్లోకము)
"ఇంద్రజిత్తు! నీవు నికుంభిళ అను పేరుగల వటవృక్షము కడకుచేరి, అభిచార హోమములను పూర్తిచేయకముందే నీ శత్రువు, శస్త్రధారివైన నిన్ను దెబ్బతీయుటకు పూనుకొన్నచో అతడే నీకు మారకుడు (అతని చేతిలో నీకు చావు తప్పదు)."
--------------------------------
తరువాత విభీషణుని సలహా పాటించి, ఇంద్రజిత్తు నికుంభిళ అను పేరుగల వటవృక్షము కడకుచేరి, అభిచార హోమములను పూర్తిచేయకముందే లక్ష్మణుడు ఆ హోమానికి విఘ్నం కలిగిస్తాడు. ఆ తరువాత జరిగిన యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణిస్తాడు.
No comments:
Post a Comment