ముందు చెప్పినట్లు శ్రీమద్రామాయణము, మహాభారతములలో గాయత్రి ప్రస్తావన తప్ప, మరియే ఇతర శక్తి రూపం ప్రస్తావన కనిపించదు. మహాభారతము తరువాత వ్రాయబడ్డ పురాణాలలో శాక్తేయ సాంప్రదాయంలో ఉన్న వివిధ శక్తి రూపాలను గురించి వివరాలు కనిపిస్తాయి.
ఐతే పురాణాలలోని ఈ కథలకు ఆధారం మాత్రం వేదము, శ్రీమద్రామాయణము, మహాభారతములలోని కథలే!
రెండు (2) ఉదాహరణలు గమనిద్దాం!
1) మార్కండేయపురాణంలో భాగమైన "శ్రీ దుర్గాసప్తశతీ" ఏకాదశ అధ్యాయంలో "శాకంభరీ దేవి" వర్ణన ఉంది.
తతోऽహమఖిలం లోకమాత్మదేహసముద్భవై:|
భరిష్యామి సురా: శాకైరావృష్టే: ప్రాణధారకై: ||
శాకంభరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి|
ఒకప్పుడు లోకంలో క్షామంతో ప్రజలు మలమలమాడిపోతుంటే పార్వతిదేవి, ప్రాణాలకు ఆధారమైన అనేకరకములైన శాకములను (కాయగూరలు, పండ్లు) తన శరీరం నుంచి సృష్టించి ప్రజలను రక్షించడంవల్ల, ఆమెకు "శాకంభరీ" అని పేరు వచ్చింది.
దీని మూలకథ శ్రీమద్రామాయణంలో ఉంది.
--------------------
శ్రీరాముడు చిత్రకూట ప్రాంతమును విడిచి, దండకారణ్యములో ప్రవేశించేముందు, అత్రి మహర్షి ఆశ్రమంలో ఒక రాత్రి గడుపుతాడు. ఆ సమయంలో అత్రి మహర్షి, తన భార్యయైన అనసూయ గొప్పతనమును గురించి చెబుతు ఇలా అంటాడు.
దశ వర్షాణ్యనావృష్ట్యా దగ్దే లోకే నిరంతరం |
యయా మూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా ||
ఉగ్రేణ తపసా యుక్తా నియమైశ్చాప్యలంకృతా || (అయోధ్యకాండ 117వ సర్గ 9,10 శ్లోకములు)
"ఒకానొక సమయమున వరుసగా పది సంవత్సరములపాటు వర్షములు కురియక కఱవుకాటకములు ఏర్పడెను. లోకములన్నియును తినుటకు తిండిలేక, త్రాగుటకు నీరులేక మలమల మాడిపోయెను. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరములైన నియమములతో తీవ్రమైన తపస్సొనర్చి, తన తప:ప్రభావముచే కందమూల, ఫలములను సృష్టించుటయేగాక, గంగానదిని ప్రవహింపజేసి, లోకముల ఆకలిదప్పులను దీర్చెను."
-------------------------
2) ప్రసిద్ధమైన మహిషాసుర వథ కథ. దేవతలనందరిని జయించి, లోక కంటకునిగా ఉన్న మహిషుని వథించడానికై శ్రీరాజరాజేశ్వరీ నిండు జవ్వనిగా, సింహారూఢినియై, స్త్రీ శక్తుల సమూహంతో కలసి, మహిషునితో తలపడుతుంది. అనేక రూపాలతో దేవిని ఎదుర్కొని, చివరికి దున్నపోతు రూపంతో తలపడినపుడు అతనిని దేవి వధిస్తుంది.
ఇది పౌరాణికగాథ.
దీని మూలకథ మహాభారతము, వన పర్వం, 230వ అధ్యాయములో ఉంది.
------------------------
అసురులకు రాజు మహిషుడు. దేవతలకు అసురులకు జరిగిన ఒక మహాయుద్ధంలో మహిషుని ధాటికి దేవతలు తట్టుకోలేక పారిపోతారు. ఆ యుద్ధంలో దేవతల సేనాధిపతైన కార్తికేయుడు విసిరిన శక్తి ఆయుధానికి మహిషుడు మరణిస్తాడు.
-----------------
No comments:
Post a Comment