పురాణాల ప్రకారం పరశురాముడు విష్ణువుయొక్క 6వ అవతారం. శ్రీమద్రామాయణంలో, మహాభారతములో కూడా కనిపిస్తాడు.
1) శ్రీమద్రామాయణంలో పరశురాముని కథ ఇలా ఉంటుంది.
శివ కేశవుల మధ్య జరిగిన పోటిలో, శివధనస్సు తన తేజాన్ని కోల్పోగ, విష్ణువు ఆధిపత్యం నిరూపణ అవుతుంది. అప్పుడు విష్ణువు తన వైష్ణవ ధనస్సును ఋచీకుని వద్ద దాచమని ఉంచుతాడు. ఆ ధనస్సు ఆయన కుమారుడైన జమదగ్ని వద్దకు చేరుతుంది.
నిరాయుధుడుగా తపస్సు చేసుకుంటున్న జమదగ్నిని, కార్తవీర్యార్జునుడు క్రూరంగా చంపుతాడు. ఆ కోపంతో పరశురాముడు అనేకసార్లు భూమిని చుట్టి, క్షత్రియులందరిని, అప్పుడే పుట్టిన పసిపిల్లలతోసహా చంపుతాడు.
ఆ తరువాత ఒక యజ్ఞం చేసి, తను సంపాదించిన భూమినంతటిని కశ్యపునికి దానంగా ఇచ్చి, మహేంద్ర పర్వతానికి తపస్సుకు వెళ్ళిపోతాడు.
తన ఈ కథ చెప్పి తరువాత వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని పరశురాముడు శ్రీరామునితో అంటాడు.
2) మహాభారతంలో పరశురాముడు ద్రోణునికి తన వద్దనున్న అస్త్రములన్ని ఇచ్చినట్లు కథ ఉంటుంది.
తపస్సు చేసుకుంటున్న జమదగ్నిని, కార్తవీర్యార్జునుడు క్రూరంగా చంపుతాడు. ఆ కోపంతో పరశురాముడు 21సార్లు భూమిని చుట్టి, క్షత్రియులందరిని, అప్పుడే పుట్టిన పసిపిల్లలతోసహా చంపుతాడు.
ఆ తరువాత తను సంపాదించిన భూమినంతటిని కశ్యపునికి దానంగా ఇచ్చి, మహేంద్ర పర్వతానికి తపస్సుకు వెళ్ళిపోతు, సంపదలను బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాడని తెలిసి, ద్రోణుడు ఆయనవద్దకు వెళతాడు.
తనకు నమస్కరించిన ద్రోణునితో తన వద్ద సంపదలు ఏమి మిగులలేవని, మిగిలినవి తన శరీరము, తన వద్దనున్న అస్త్రములేనని పరశురాముడు చెబుతాడు. అవే ఇమ్మని ద్రోణుడు అడుగగా, పరశురాముడు అస్త్రములన్ని, ప్రయోగ ఉపసంహార రహస్యాలతోసహా ఇస్తాడు.
3) ఇక్కడ గమనించవలసిన విషయాలు.
(i) శ్రీమద్రామాయణం జరిగిన చాల కాలానికి మహాభారత కథ జరిగింది.
(ii) శ్రీమద్రామాయణంలో తాను అనేకసార్లు భూమిని చుట్టి, క్షత్రియులందరిని, అప్పుడే పుట్టిన పసిపిల్లలతోసహా చంపినట్లు పరశురాముడు చెప్పినది నిజమైతే, అటు దశరథుడు పుట్టిన ఇక్ష్వాకు వంశస్థులను, జనకుడు పుట్టిన నిమి వంశస్థులను కూడా పరశురాముడు చంపి ఉండాలి.
ఐతే శ్రీసీతారామ కళ్యాణ సందర్భంగా వాల్మీకి మహర్షి వివరించిన రెండు వంశాల క్రమంలో ఎక్కడ కూడా ఆ వంశస్థులు పరశురాముని వలన మరణించినట్లు చెప్పలేదు.
(iii) తను సంపాదించిన భూమినంతటిని కశ్యపునికి దానంగా ఇచ్చి, మహేంద్ర పర్వతానికి తపస్సుకు వెళ్ళిపోయినట్లు ఉంది. మరి మహాభారతంలో పరశురాముడు ద్రోణునికి తన వద్దనున్న అస్త్రములన్ని ఇచ్చినట్లు ఉన్న కథే నిజమైతే, శ్రీమద్రామాయణ కాలం నాటికి ద్రోణుడు వెళ్ళి, అస్త్రాలన్నీ స్వీకరించాడా?
(iv) ఈ కథల వల్ల నాకు అర్థమయ్యిందేమిటంటే,
I) ఇక్ష్వాకు, నిమి వంశస్థులు పరశురాముని వలన మరణించలేదు. అంటే పరశురాముని కథ శ్రీమద్రామాయణ కాలంనాటిది కాదు. ఆ తరువాత చాలా కాలం తరువాత జరిగిన మహాభారతకాలంనాటివాడు పరుశురాముడు.
II) శ్రీమద్రామాయణం బాలకాండలో ఈ కథలను, పరశురాముడు శ్రీరామునికన్నా పూర్వుడని నిరూపించే ఉద్దేశ్యంతో తరువాతి కాలంలో చేర్చబడినవే. అలా నిరూపిస్తేకానీ, పరశురాముడు, శ్రీరాముని కన్నా ముందు వచ్చిన విష్ణువవతారమని పాఠకులు నమ్మరుకద!
పరశురాముడు విష్ణువవతారం కాదు.
No comments:
Post a Comment