శ్రీరాముడు విష్ణువవతారం కాదని అనేకమార్లు వ్రాసాను. మరి శ్రీరామునిలో ఉన్న ఏ గుణాలవల్ల ఆయన భగవంతుని స్థాయికి ఎదిగారు, అని ఆలోచిస్తూంటే క్రింద వివరించిన శ్రీమద్రామాయణంలోని సన్నివేశంలో నాకు సమాధానం దొఱికింది.
లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి మధ్య జరిగిన చివరి యుద్ధంలో, ఆ ఇద్దరు యోధులు వారి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతారు. తమ వద్దనున్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు. ఐనా ఇంద్రజిత్తుని జయించడం లక్ష్మణుడికి సాధ్యం కాలేదు.
అప్పుడు లక్ష్మణుడు ఐంద్రాస్త్రం ఎక్కుపెట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు.
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది ||
పౌరుషే చ అప్రతిద్వంద్వ: శరైనం జహి రావణిం | (యుద్ధకాండ 90వ సర్గ 71వ శ్లోకము)
"ఓ బాణమా! దశరథ మహారాజు కుమారుడు, ధర్మనిరతుడు, సత్యసంధుడు ఐన శ్రీరాముడు నిజముగా పరాక్రమమున సాటిలేనివాడే యైనచో ఈ ఇంద్రజిత్తును హతమార్చుము"
ఆ అస్త్రం ధాటికి ఇంద్రజిత్తు తలతెగి నేలమీద పడుతుంది.
ఐతే ఇంద్రజిత్తుని చంపినది లక్ష్మణుడి బాణమేయైనా, అందుకు కారణం మాత్రం శ్రీరాముని తపశ్శక్తియే!
అంతకు ముందు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపడానికి తన వద్దనున్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తాడు, కానీ ఇంద్రజిత్తుని చంపడం సాధ్యం కాలేదు. చివరకు శ్రీరాముని (i) ధర్మజ్ఞత్వం, (ii) సత్యసంధత, (iii) అజేయత్వం అనే 3 గొప్ప గుణాలు తోడుగాచేసి చేసిన ఆ ప్రార్థన వల్లనే ఇంద్రజిత్తు మరణిస్తాడు.
శ్రీరామునిలో ఉన్న ఈ 3 గొప్ప గుణాల వల్లనే ఆయన భగవంతుని స్థాయికి ఎదిగారు.
No comments:
Post a Comment