అరణ్యవాస సమయంలో
రాబోయే అనివార్యమైన యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులను
ఎదిరించడానికి, ఇంద్రుని ఆరాధించి దివ్యాస్త్రాలన్నీ పొందమని అన్న ధర్మరాజు
చెప్పగా, అర్జునుడు హిమాలయాలకు తపస్సుకు వెళ్ళినపుడు ఇంద్రుడు కనిపించి,
దేవాధిదేవుడైన శంకరుని ఆరాధించి దివ్యమైన "పాశుపతాస్త్రము" పొందమని
చెప్పినట్లు మహాభారతంలో ఉంది.
అర్జునుడు
శంకరుని కొఱకై తపస్సు చేయగా, శంకరుడు కిరాతుని రూపంలో అర్జునుని
పరిక్షించి ప్రయోగ ఉపసంహారములతో "పాశుపతాస్త్రము" నేర్పినట్లు కథ. అదే
సమయంలో "పాశుపతాస్త్రము" తిరుగులేని అస్త్రమని, దాని గురించి దేవతలకే
తెలియదని, మనష్యులెవరికి తెలిసే అవకాశంలేదని అంటాడు.
ఈ
పాశుపతాస్త్రాన్ని అర్జునుడు మహాభారతయుద్ధంలో ఎక్కడకూడా వాడినట్లు లేదు.
ఐతే కొన్ని సంస్కృత మహాభారత అనువాదాల్లో, సైంధవుని తలను ఒక
దివ్యాస్త్రంతో నఱికి, ఆ తలను సాయంసంధ్యాసమయంలో ధ్యాననిమగ్నుడై ఉన్న అతని
తండ్రి ఒడిలో పడేటట్లు చేయడానికి, అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వాడినట్లు
ఉంది.
ఇక్కడ ఆలోచించవలసినది అర్జునుడు
పాశుపతాస్త్రాన్ని వాడినట్లా (లేదా) వాడలేదా అనికాదు. "పాశుపతాస్త్రము"
అత్యంతశక్తివంతమైన తిరుగులేని అస్త్రమా అని?
ఇంకొక విషయాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి!
ఆశ్వథ్థామ
రాత్రి సమయంలో పాండవుల కుమారులను, మిగిలిన సైన్యాన్ని, క్రూరంగా
సంహరించి, మహర్షి వ్యాసుని ఆశ్రమంలో తలదాచుకుంటాడు. అతనిని వెతుకుతు
వచ్చిన పాండవులను చూసి, ఒక గడ్డిపోచను "బ్రహ్మశిరస్సు" అనే అస్త్రంగా
మంత్రించి, పాండవుల అంతం సంకల్పించి, వదులుతాడు.
ఆ
అస్త్రాన్ని ఆపడానికి వేరు మార్గం స్ఫురించక తను కూడా "బ్రహ్మశిరస్సు" అనే
అస్త్రంగా మంత్రించి అర్జునుడు వదులుతాడు. ఆ రెండు అస్త్రాలు
ఒకదానినొకటి తాకుతే ప్రపంచం నాశనమవుతుందని, మహర్షి వ్యాసుడు, దేవర్షి
నారదుడు వాటి మధ్య నిలబడి, వాటిని ఆపుతారు.
ఇక్కడ
గమనించవలసిన విషయమేమిటంటే, "పాశుపతాస్త్రము" అత్యంతశక్తివంతమైన తిరుగులేని
అస్త్రమే ఐతే, "బ్రహ్మశిరస్సు" అనే అస్త్రాన్ని ఆపడానికి, అర్జునుడు
"పాశుపతాస్త్రము" ఎందుకు ప్రయోగించలేదు? తాను కూడా "బ్రహ్మశిరస్సు" అనే
అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడు?
దీనికి నాకు స్ఫురించిన సమాధానం:
అప్పటిదాకా
ఇంద్రుడి తరువాత స్థానంలో ఉన్న విష్ణువును దేవతలలో అధికుడిని చేయడానికి,
శ్రీమద్రామాయణంలో, మహాభారతంలో కొన్ని ప్రక్షిప్తాలు ఎలాగైతే వైష్ణవులు
కలిపారో, అదేవిధంగా శివుడిని అధికుడిని చేయడానికి, "పాశుపతాస్త్రము"
తిరుగులేని అస్త్రమని, దాని గురించి దేవతలకే తెలియదని, మనష్యులెవరికి
తెలిసే అవకాశంలేదని శివుని చేత శైవులు అనిపించారు.

No comments:
Post a Comment