భరతుడు చిత్రకూటంలో శ్రీరాముని కలసి, తండ్రి మరణించిన వార్తను వినిపించగానే, శ్రీరాముడు స్పృహ కోల్పోతాడు. తెలివిరాగానే దు:ఖించి, గతించిన తండ్రికి సీతాలక్ష్మణులతో కలసి, నీటితో తర్పణాలు విడిచి, తాను వనవాసధర్మంలో ఉన్నాడు కాబట్టి, ఆడవిలో దొఱికే గారపిండితోనే పిండప్రదానం చేసి తన ఆశ్రమానికి తిరిగి వస్తాడు.
దశరథునికి పిండప్రదానం చేసి సీతారామలక్ష్మణులు వెళ్ళిపోయిన తరువాత, కులగురువైన వశిష్టునితో కలసి వచ్చిన కౌసల్య, శ్రీరాముడు గతించిన తండ్రికోసమై ఉంచిన గారపిండి ముద్దలను చూసి, ఎంతో దు:ఖిస్తుంది.
భూమండలాన్ని పాలించి, సకలభోగములను అనుభవించిన దశరథునికి "గారపిండి"తో పిండప్రదానమా? అని బాధపడుతుంది. అంతకంటే బాధాకరమైన విషయమేముంటుందని ఇలా అనుకుంటూ శోకిస్తుంది.
శ్రుతిస్తు ఖల్వియం సత్యా లౌకికీ ప్రతిభాతి మా |
యదన్న: పురుషో భవతి తదన్నాస్తస్య దేవతా: || (అయోధ్యకాండ 103వ సర్గ 15వ శ్లోకము)
--------
మానవులు తాము భుజించెడి ఆహారమునే దేవతలకు 'నైవేద్యము గావింతురు' అనే శ్రుతివచనము, శ్రీరాముడు ఆడవిలో దొఱికే గారపిండితోనే పిండప్రదానం చేసాడు అనే విషయం కలిపి ఆలోచిస్తే, మనకు 2 విషయాలు అర్థమవుతాయి.
1. శ్రీరాముడు వనవాస సమయంలో మాంసం భుజించాడనే పిట్టకథలు నమ్మవలసిన అవుసరంలేదు. ఎందుకంటే తాను స్వయంగా మాంసం వనవాస సమయంలో భుజిస్తూంటే, మానవులు తాము భుజించెడి ఆహారమునే దేవతలకు 'నైవేద్యము గావింతురు' అనే శ్రుతివచనాన్నుసరించి, దశరథునికి అదే పిండప్రదానం చేసేవాడు. అలా చెయ్యలేదు. పైగా "గారపిండి" ముద్దలనే పిండప్రదానం చేసాడు. కాబట్టి శ్రీరాముడు వనవాససమయంలో కందమూలాలు, ఫలాలపైనే ఆధారపడి జీవించాడు.
2. గతించిన పెద్దలకు పిండప్రదానం, తాము స్వీకరించే ఆహారంతోనే చేయమని శ్రుతులు చెబుతూంటే, అనవసరంగా భారీగా శ్రాద్ధకర్మలకు ధనం ఎందుకు ఖర్చుచేస్తున్నాము? ఆలోచించాలి.
No comments:
Post a Comment