Friday, 25 September 2015

శ్రీమద్రామాయణ కావ్యం వ్రాసినదెవరు?


శ్రీమద్రామాయణము ప్రతి సర్గ తరువాత "ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే..." అని ఉండి తరువాత కాండ, సర్గల పేర్లు ఉంటాయి.   
శ్రీమద్రామాయణ కావ్య ప్రారంభంలో, బాలకాండలోని  మొదటి 4 సర్గలలో తప్ప వాల్మీకే కావ్యం వ్రాసినట్లు ఎక్కడా చెప్పబడలేదు.     శ్రీమద్రామాయణ కావ్య ప్రారంభంలో, బాలకాండలోని మొదటి 4 సర్గలలోను, అయోధ్యకాండలో ఒకేసారి, ఉత్తరకాండలో తప్ప వాల్మికి ప్రస్తావన కనిపించదు.

బాలకాండలో, మొదటి 4 సర్గలలో వాల్మీకే కావ్యం వ్రాసినట్లు చెప్పబడినా, అందులో శ్రీ మహావిష్ణువు గురించి కీర్తిస్తూ ఉండడం వల్లను, మరి కొన్ని కారణాల వల్లను, 4 సర్గలు ప్రక్షిప్తమని వాదన ఉంది.     ఉత్తరకాండ మొత్తం ప్రక్షిప్తమని ఇదివరకే చెప్పాను.

------------
అయోధ్యకాండలో ఒకేసారి వచ్చే వాల్మికి ప్రస్తావన  ఇలా ఉంటుంది.  చిత్రకూట పర్వతప్రాంతానికి చేరేముందు, సీతారామలక్ష్మణులు వాల్మికి మహర్షిని కలుస్తారు. 
ఇతి సీతా రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి: |
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్ ||     (అయోధ్యకాండము - 56వ సర్గ 16వ శ్లోకము )

"పిదప సీతారామలక్ష్మణులు వాల్మికి మహర్షి ఆశ్రమమునకేగి, దోసిలియొగ్గి, ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి." 

తాన్మహర్షి: ప్రముదిత: పూజయామాస ధర్మవిత్ |
ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య ||     (అయోధ్యకాండము - 56వ సర్గ 17వ శ్లోకము )

"ధర్మాతుడైన వాల్మికి మహర్షి సీతారామలక్ష్మణులరాకకు మిగుల సంతసించి, ''మీకు స్వాగతము,విచ్చేయుడు, ఆసీనులుకండు", అని పలుకుచు వారికి ఆదరసత్కారములను నెఱపెను."

-----------------
శ్రీరాముని కాలంవారెవరైనా, శ్రీరాముని జీవిత విశేషాలు క్షుణ్ణంగా తెలిసిన వారు, లోకకళ్యాణం కోరి, శ్రీమద్రామాయణ కావ్యం రచించి, తమ పేరు బయటకు రాకూడదని, వాల్మికి మహర్షి పాత్రను సృష్టించి ఉండవచ్చు.
బాలకాండలోని మొదటి 4 సర్గలు ప్రక్షిప్తమనుకుంటే, శ్రీరామయాణంతో ముడిపడ్డ ప్రతిపాత్రయొక్క మనోభావాలన్నీ తెలుస్తాయని, స్వయంభుబ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం ప్రక్షిప్తమవుతుంది.
అప్పుడు వాల్మీకి మహర్షి కావ్యకర్త కాదని అనిపిస్తుంది.

శ్రీమద్రామాయణ కావ్యం శ్రీరాముని సమకాలికులు మరెవరైనా వ్రాసారని అనుకుంటే, కవికి శ్రీరామయాణంతో ముడిపడ్డ ప్రతిపాత్రయొక్క మనోభావాలన్నీ తెలియాలి కద!

ఇంకా కవి వేదవిదుడయ్యి ఉండాలి. ప్రతి వ్యక్తిని నిశితంగా పరిశీలించే ప్రజ్ఞ ఉండాలి. స్థితప్రజ్ఞుడయి ఉండాలి. ప్రధాన పాత్రధారులైన శ్రీరామ, సీత, లక్షణ, సుగ్రీవ, విభీషణాదులతో సాన్నిహిత్యముండి ఉండాలి.

ఇన్ని లక్షణాలుండి కవి లోకకళ్యాణమాసించే వ్యక్తి అయిఉండాలి. అటువంటి వ్యక్తి మరెవరున్నారు. శ్రీహనుమంతుడు తప్ప.


శ్రీమద్రామాయణ కావ్యం శ్రీహనుమంతుడే వ్రాసి ఉండాలి.

No comments:

Post a Comment