Thursday, 3 September 2015

శ్రీరాముడు అస్త్రవిద్యలు ఎవరివద్ద నేర్చాడు?



శ్రీమద్రామాయణంలోని బాలకాండ చదివినవారు, విన్నవారు ఎవ్వరైనా, శ్రీరాముడు అస్త్రవిద్యలు బ్రహ్మర్షి విశ్వామిత్రునివద్ద నేర్చాడని చెబుతారు.  బాలకాండ ప్రకారం అది నిజమే!

ఐతే అయోధ్యకాండలో శ్రీరాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళిన తరువాత సుమిత్రాదేవి కౌసల్యను ఓదారస్తూ ఇలా అంటుంది.

దదౌ చ అస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మా మహా ఓజసే |
దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజ సుతం రణే ||
స శూర: పురుషవ్యాఘ్ర: స్వబాహుబలమాశ్రిత: |
అసంత్రస్తో అప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ||   (అయోధ్యకాండ 44వ సర్గ 11-12వ శ్లోకములు)

"తిమిధ్వజుని  కుమారుని శ్రీరాముడు హతమార్చెను.  అందులకు సంతోషించి, బ్రహ్మదేవుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను ఒసంగెను.

దివ్యాస్త్రసంపన్నుడును, నరశ్రేష్టుడును ఐన ఆ శ్రీరాముని బాహుబలము తిరుగులేనిది.  అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలె ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు."

ఈ తిమిధ్వజుడు ఎవరు?

శ్రీరామ యువరాజ్య పట్టాభిషేకవార్తను కైకకు చెప్పి, ఆమెను దశరథుని 2 వరాలు కోరుకోమని రెచ్చగొట్టే సమయంలో, మంథర ఇలా అంటుంది.

తవ దైవాసురే యుద్ధే సహ రాజర్ష్హిభి: పతి: |
అగచ్చత్ త్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ ||

దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దణ్డకాన్ ప్రతి |
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిధ్వజ: ||

స శంబర ఇతి ఖ్యాత: శతమాయో మహాసుర: |
దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జిత:||  (అయోధ్యకాండ 9వ సర్గ 11-13వ శ్లోకములు)

"పూర్వము నీ పతియైన దశరథుడు దేవాసుర సంగ్రామునందు దేవేంద్రునకు సహాయపడదలచెను.  అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను, తన పరివారమును, నిన్ను చెంటనిడుకొని దక్షిణ దిశలో ఉన్న తిమిధ్వజుని వైజయంతపురమునకు   బయలుదేఱెను.

పెక్కు మాయలను నేర్చిన శంబరాసురుడే ఆ తిమిధ్వజుడు.   అతడు దేవతలను అందఱిని జయించి, దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను."

ఇతని చేతిలోనే దశరథుడు ఓటమి పాలయినపుడు కైక రక్షించిన సమయంలోనే,  దశరథుడు కైకకు 2 వరాలు ఇచ్చాడు.

ఈ తిమిధ్వజుని  కుమారునే శ్రీరాముడు హతమార్చెను.   శ్రీమద్రామాయణం ప్రకారం, శ్రీరాముడు అప్పటివరకు సంహరించినది - తాటకను, సిద్ధాశ్రమంలో సుబాహువును, మరికొంతమంది చిన్న రాక్షసులను మాత్రమే!  తాటక సుందుల పుత్రుడైన మారీచుని బాణప్రయోగంతో సముద్రంలో పడేటట్లు చేస్తాడుగానీ, సంహరించడు.

కాబట్టి సుబాహువే తిమిధ్వజుని కుమారుడై ఉండాలి!

ఐతే ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, సుమిత్ర కౌసల్యతో, తిమిధ్వజుని  కుమారుని సంహరించిన శ్రీరామునకు, బ్రహ్మదేవుడు దివ్యాస్త్రములను ఒసంగెను అని అంటోంది.

శ్రీమద్రామాయణంలోని బాలకాండలో ఉన్న కథ ప్రకారం శ్రీరాముడు దివ్య అస్త్రవిద్యలు బ్రహ్మర్షి విశ్వామిత్రునివద్ద నేర్చాడు.



ఏది సరియైనది?

No comments:

Post a Comment