శ్రీమద్రామాయణములోని క్రింద వివరించబడిన విషయములు గమనించగలరు.
అంజలిం ప్రాఙ్ముఖ: కృత్వా పవనాయాత్మయోనయే |
తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం || (సుందరకాండ 1వ సర్గ 9వ శ్లోకం)
"పిమ్మట కార్యదక్షుడైన, దక్షిణాచారుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియగు వాయుదేవునకు ప్రణమిల్లి, దక్షిణదిశగా వెళ్ళదలిచినవాడై అతడు తన శరీరమును పెంచెను."
ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి రెండు మారులు "దక్షిణ" అన్న పదం ఎందుకు ప్రయోగించారు?
స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు తన "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములో ఈ విషయము గురించి ఒక భిన్నమైన కోణంలో చర్చించారు.
శ్రీ హనుమ దక్షిణాచారము పాటించేవాడు అనే అర్ధంలో మొదటి "దక్షిణో" అనే పదం వాడబడింది.
&&&&&&&&&&&&&&
దక్షిణాచారము అంటే వేదవిహితమైన పద్ధతి అని అర్ధం.
అంటే జన్మత: కలిగిన శక్తియుక్తులతో జీవించే జీవనమైనా, లేదా గురువు తెలిపిన పద్ధతిలో ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల మానవాతీత శక్తులు సంపాదించిన తరువాత జీవించే జీవనమైనా, అది లోకహితం కోరుకునే "జీవనశైలి" అని అర్ధం.
గురువు తెలిపిన పద్ధతిలో ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల శక్తులు లభించవచ్చును లేక లభించక పోవచ్చును. దానికి సాధకుడు బాధపడడు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన లక్ష్యం శాశ్వతమైన ఆనందం మాత్రమే కానీ శక్తులు సంపాదించడంకాదు.
శరీరానికి ఉండే ప్రారబ్ధంబట్టి శక్తులు లభించవచ్చును లేక లభించక పోవచ్చును.
దీనికి వ్యతిరేకమైనది వామాచారం.
జన్మత: కలిగిన శక్తియుక్తులను లేదా తక్కువ సమయంలో తంత్రమార్గంలో మానవాతీత శక్తులు సంపాదించినా కూడా తన, మరియు తనవారి హితం మాత్రమే కోరుకునేది, అందుకోసం అవుసరమైతే, మిగిలిన మనుష్యులను, జీవులను పీడించడానికి, నాశనం చేయడానికి కూడా సిద్ధపడడం.
వామాచార పద్ధతిలో, మద్యం, మాంసం వినియోగం, స్త్రీ పురుష సంభోగం, జంతుబలులు ఇవ్వడం అనేవి భాగాలు.
వామాచారానికి ప్రతినిధులుగా రావణుని, అతని కుమారుడైన ఇంద్రజిత్తును వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు.
&&&&&&&&&&&&&&&&&&&&
1) శ్రీరాముడు వానరసైన్యంతో కలసి లంకకు చేరి, యుద్ధం ప్రారంభిస్తాడు. శ్రీరాముని పరాక్రమానికి రావణుడుగానీ, రాక్షస సైన్యంగానీ తట్టుకోలేక పరాభవం పొందారు.
స తత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై: పతోమరై:|
ఛాగస్య కృష్ణవర్ణస్య గళం జగ్రాహ జీవత:| (యుద్ధకాండ 73వ సర్గ 22వ శ్లోకం)
ఇంద్రజిత్తు యుద్ధభూమియందు అగ్ని చుట్టును పరిస్తరణములను (దర్భలను), చిన్న ఈటెలను పఱచి, సజీవముగానున్న నల్లని మేకయొక్క కంఠమును పట్టుకునెను. పిదప దానిని అగ్నికి ఆహుతిగా ఇచ్చెను.
అప్పుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు తనకున్న మాయాశక్తుల సహాయంతో, రధంతోసహా అదృశ్యమై, వానరసైన్యంపై శస్త్ర,అస్త్రప్రయోగం చేస్తాడు.
అంతటితో ఆగక, వానరసైన్యంపై బ్రహ్మాస్త్రప్రయోగం చేస్తాడు. అమోఘమైన ఆ శస్త్ర ప్రయోగంవల్ల 67 కోట్ల మంది వానరులు మరణిస్తారు.
ఆనాడు శ్రీహనుమంతుడు హిమాలయాలనుండి సంజీవనీ పర్వతం తెచ్చి, మిగిలిన వానరులకు, శ్రీరామ లక్ష్మణులకు స్వాంతన కలిగిస్తాడు.
******
2) శ్రీరాముని అతని సైన్యాన్ని ఏమార్చి, తను చెయ్యబోయే తాంత్రిక హోమానికి అడ్డురాకుండా చేసుకుందామని, శ్రీహనుమ ఇంకా వానర సైన్యం చూస్తుండగా, ఇంద్రజిత్తు మాయ సీతను వధిస్తాడు.
అతని పన్నాగం ఫలించి, శ్రీహనుమ ఇంకా వానర సైన్యం మాయ సీత చనిపోవడంతో నిస్పృహతో వెనుతిరిగి శ్రీరామునికి ఆ విషయం వినిపిస్తారు. వెంటనే శ్రీరాముడు స్పృహ కోల్పోతాడు.
అప్పుడు విభీషణుడు అందరిని ఓదార్చి ఇంద్రజిత్తు మాయ సీతను మాత్రమే వధించి ఉంటాడని, అసలు సీతను వధించడానికి రావణుడు ఒప్పుకోడని చెప్పి, ఇంద్రజిత్తు నికుంభిల దగ్గర చేస్తున్న తాంత్రిక హోమాన్ని ఆపడానికి లక్ష్మణుని పంపమని చెబుతాడు.
తాంత్రిక హోమాన్ని ఆపినవాని చేతిలోనే ఇంద్రజిత్తు మరణముందని చెబుతాడు. చివరికి అలానే లక్ష్మణుని చేతిలోనే ఇంద్రజిత్తు మరణం సంభవిస్తుంది.
తాంత్రిక పద్ధతిలో శక్తులు సంపాదించినవానికి, వాటి వ్యామోహంలో పడి, విచక్షణ కోల్పోతే ఇంద్రజిత్తుకు వలె మరణం సంభవిస్తుంది.
No comments:
Post a Comment